ఖైరతాబాద్, అక్టోబర్ 19 : వేలకోట్ల విలువజేసే భూములను ప్రభుత్వ పెద్దల అండదండలతో కబ్జా చేయాలని చూస్తున్నారని, ఇందులో మల్కాజిగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ సూర్యనారాయణరెడ్డికి చెందిన భూమి కూడా ఉన్నదని, ఇక్కడ నివసిస్తున్నవారిని ఖాళీ చేయాలని భయపెడుతున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
మల్కాజిగిరి తిరుమలనగర్‌లో సర్వే నం.398, 409, 411/1, 579లలో సుమారు 300 ఎకరాల భూమి ఉందని, అందులో ఖాళీ స్థలం పోగా మిగతా స్థలంలో 500 కుటుంబాలు దశాబ్దాలుగా ఇండ్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పెద్దల కన్ను ఈ భూములపై పడిందని, వాటి ఆక్రమణకు బినామీలను రంగంలోకి దింపారని చెప్పారు.
ఒక యజమాని అరుణాదేవి కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా ఆమె జాగను వదలడం లేదని వివరించారు. తహసీల్దార్ సైతం ఈ భూములపై యజమానులకు హక్కు లేదన్నట్టు డ్యాకుమెంట్లు చూపిస్తున్నారని, పోలీసులే దగ్గరుండి కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ అనుచరుడిగా ఉన్న ఫయీమ్ ఖురేషీ భూముల ఆక్రమణకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
తమకు న్యాయం చేయాలని తిరుమలనగర్ ప్రజలు రాచకొండ సీపీని కలిస్తే చర్యలు తీసుకోవడం లేదని, పోలీసులే కబ్జాదారులను ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. రేవంత్ సర్కారులో భూకబ్జాలు పెరిగాయన్నారు. 19.18 ఎకరాల విషయంలో యజమాని సూర్యనారాయణరెడ్డి రాచకొండ సీపీని కలిస్తే దీనివెనుక పెద్దలు ఉన్నారని చెప్పినట్టు తెలిపారు.