పెద్దపల్లి, జూన్ 2 (నమస్తే తెలంగాణ): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బ్యాక్ వాటర్ ఏరియా ఇరిగేషన్ భూములు ఆక్రమణ వ్యవహారంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జనవరిలోనే జాయింట్ సర్వే చేపట్టి, 22 చెరువులు ఇరిగేషన్ భూముల్లోనే ఉన్నాయని గుర్తించినట్టు తెలుస్తున్నది. పూర్తి ఎఫ్‌టీఎల్‌లోనే దాదాపుగా 150 ఎకరాలను అక్రమార్కులు కబ్జా చేసినట్టు నిర్ధారించారని సమాచారం. కానీ చెరువులను తొలగించడం తమ పని కాదంటే.. తమ పని కాదని అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వంలోని కొందరు కీలక నేతలు, అధికారపార్టీ నాయకుల అండతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రెండుశాఖల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి, చేతులు దులుపుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎల్లంపల్లి ప్రాజెక్టు భూములను కబ్జా చేశారని స్థానికుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమగ్ర సర్వే చేపట్టి ఎల్లంపల్లి భూములకు హద్దులు పెట్టారు. జాయింట్ రిపోర్టును ఉన్నతాధికారులకు సమర్పించారు. వారి సూచనల మేరకు ఈ ఏడాది జనవరి 7న అంతర్గాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ ఐదు నెలలు గడిచినా కేసులు నమోదు కాలేదు. అక్రమాలను నిగ్గు తేల్చినా వారిపై ఎలాంటి చర్యలూ లేకపోవడంతో ఇందులో పెద్దల పాత్ర ఉందనే విషయం స్పష్టమవుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా నిర్మించిన చెరువుల్లో చేపల కోసం గోదావరిఖని చికెన్ మార్కెట్లోని విషతుల్యమైన కోళ్ల వ్యర్థాలు ప్రతీరోజు క్వింటాళ్ల కొద్దీ వేస్తున్నారని చెప్తున్నారు. ఇదేవిషయంపై పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ అధికారి అంతర్గాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపైనా పోలీసులు కేసు నమోదు చేయలేదు.
రెవెన్యూ భూమి అయినా.. ఇరిగేషన్ భూమి అయినా కబ్జా అయితే వాటిని తొలగించాల్సింది రెవెన్యూ అధికారులేనని కోర్టులు అనేక తీర్పుల్లో చెప్పాయని స్థానిక రైతు సంఘాల నాయకులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడంతో ఆ బాధ్యత హైడ్రాకు మళ్లిందని వివరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూమి కబ్జా చేసి చెరువులను తవ్వితే మాత్రం రెవెన్యూ, ఇరిగేషన్, హైడ్రా అధికారులు ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.