పెద్దపల్లి, జూన్ 4 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇరిగేషన్ భూములను కబ్జా, చెరువుల తవ్వకంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఎట్టకేలకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని భూములను ఆక్రమించి, దర్జాగా చెరువులను నిర్మించడమేకాకుండా కోళ్ల వ్యర్థాలతో చేపలను పెంచుతున్నారని, ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని పేర్కొంటూ మూడు రోజులుగా ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాలకు పెద్దపల్లి జిల్లా యంత్రాంగం స్పందించింది.
బుధవారం పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ఏరియా హెచ్ఎండబ్ల్యూఎస్, వాటర్ గ్రిడ్‌కు ఎగువన ముర్మూరులో నిర్మించిన అక్రమ చెరువులను పరిశీలించారు.
నీటిపారుదల శాఖకు సంబంధించి సుమారు 70 ఎకరాల అసైన్డ్ భూమి కబ్జా చేసి చేపల చెరువులను తవ్వినట్టుగా గుర్తించినట్టు అదనపు కలెక్టర్ డీ వేణు తెలిపారు. అనుమతులు లేకుండా చేపట్టిన ఈ చేపల చెరువు (ఫిష్ పాండ్)లను వెంటనే తొలగించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి చేపల చెరువులను నిర్వహిస్తున్న వారిపై పోలీస్ కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు.
70 ఎకరాల ప్రభుత్వ భూమిని మళ్లీ స్వాధీనం చేసుకోవాల్సిందిగా నీటి పారుదల శాఖ ఈఈకి ఆదేశాలు జారీ చేశారు. కాగా చేపల చెరువుల దిగువన ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ మహానగరానికి సరఫరా చేసే తాగు నీటిలో ఎటువంటి కలుషిత పదార్థాలు లేవని అదనపు కలెక్టర్ తెలిపారు.