
సీఎం వినతికి ప్రధాని సానుకూలం
ఢిల్లీలో తెలంగాణ రాష్ర్టానికి అధికారిక అతిథిగృహం నిర్మించుకోవడానికి స్థలమిస్తామని ప్రధాని నరేంద్రమోదీ.. సీఎం కేసీఆర్‌కు హామీ ఇచ్చారు. దేశ రాజధానిలో అన్ని రాష్ర్టాలకు భవనాలున్నాయని.. తెలంగాణకు కూడా భవనం నిర్మించుకోవడానికి అనువైన స్థలాన్నివ్వాలని సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో మోదీకి విజ్ఞప్తిచేశారు. నిజాం హయాంలో నిర్మించిన హైదరాబాద్‌హౌస్‌ను కేంద్రం తీసుకోవడంతోపాటు, దానికి బదులుగా కేటాయించిన స్థలంలో నిర్మించిన ఏపీ భవన్‌ను విభజన చట్టంద్వారా రెండు రాష్ర్టాలకు విభజించి ఇవ్వడంతో తెలంగాణకు విశాల భవనం లేకుండాపోయిందని తెలిపారు. ఢిల్లీలో ఒక్కో రాష్ర్టానికి రెండు, మూడేసి భవనాలు ఉన్నాయని గుర్తు చేశారు. గుజరాత్‌కు మూడు, కర్ణాటకకు రెండు అధికారిక భవనాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మోదీ.. టీఎస్ భవనానికి స్థలం ఇస్తానని హామీ ఇచ్చారు. ‘మీ రాష్ర్టానికి అధికారికంగా ఢిల్లీలో భవనం ఉండటం మీ హక్కు. ఢిల్లీలో స్థలం ఎక్కడుందో చూసి ప్రతిపాదనలు పంపించండి.. నేను కూడా స్థలాన్ని చూడాల్సిందిగా అధికారులను ఆదేశిస్తాను’ అని ప్రధాని హామీ ఇచ్చినట్టు తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ భవన్‌ను రెండుగా విభజించి కేటాయించారు. ఇందులో తెలంగాణకు కేటాయించిన భవనాన్ని ఆనుకొని కొంత స్థలం ఉన్నప్పటికీ.. విశాలంగా భవనం నిర్మించడానికి స్థలం లేకుండా పోయింది. ఏపీ భవన్లో తెలంగాణకు కేటాయించిన భవనం ఇప్పటి అవసరాలకు సరిపడేవిధంగా లేకపోవడంతో.. వేరేచోట విశాలంగా భవనాన్ని నిర్మించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి నివేదించారు. ప్రధానిమోదీ తప్పకుండా స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.