TG I Pass | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన భూములను కేటాయించడంతోపాటు అన్ని రకాల అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో మంజూరు చేసేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ (టీజీ-ఐపాస్) వ్యవస్థ కొందరు అధికారులు, బయట వ్యక్తుల చేతిలో బందీగా మారిపోయింది. గతంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఎవ్వరినీ యాచించే అవసరం లేకుండా అర్హతలకు అనుగుణంగా భూములు కేటాయించిన ఈ విధానం.. ఇప్పుడు కొందరు వ్యక్తుల కనుసన్నల్లో పనిచేసే ‘ప్రత్యేక’ చానల్ ద్వారా వెళ్తేనే స్పందిస్తున్నది. వారు ఓకే అంటేనే అనుమతులు జారీ అవుతున్నట్టు టీజీఐఐసీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిశ్రమలకు ఆన్లైన్లో అనుమతులు జారీచేసే విధానం నిలిచిపోయింది. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులు బుట్టదాఖలవుతున్నాయి. ప్రస్తుతం టీజీఐఐసీలో ప్రభుత్వం నియమించిన ఒకరిద్దరు అధికారులు, మరి కొందరు బయటి వ్యక్తుల ప్రమేయంతోనే అనుమతులు జారీ అవుతున్నట్టు తెలుస్తున్నది.
వారిని సంప్రదించకుండా ఆన్లైన్లో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం ఉండటం లేదని, ఆ దరఖాస్తులన్నీ బుట్టదాఖలవుతున్నాయని వినికిడి. ఏడాది క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క కొత్త పారిశ్రామికవాడను ఏర్పాటు చేయకపోగా గతంలో అభివృద్ధి చేసిన ఇండస్ట్రియల్ పార్కుల్లో ఇష్టారాజ్యంగా భూములను కేటాయిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్ధిపేట, వరంగల్, సంగారెడ్డి తదితర జిల్లాల పరిధిలో తమకు తెలియకుండా ఏ పరిశ్రమకూ భూ ములు కేటాయించవద్దని అధికారులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు హుకుం జారీచేసినట్టు తెలిసింది. గతంలో కేటాయించిన భూముల్లో ఇప్పుడు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వస్తున్నవారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్టు సమాచారం.
భూ కేటాయింపులో పారదర్శకత శూన్యం
పారదర్శకంగా భూసేకరణ నిర్వహించడం, ఎవరికీ ఇబ్బంది తలెత్తకుండా ఇండస్ట్రియల్ పార్క్‌లను అభివృద్ధి చేయడం ద్వారా గత ప్రభుత్వం భారీగా పెట్టుబడులు సాధించింది. కానీ, ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండడం గమనార్హం. ఫార్మాసిటీలో భూముల కోసం ఎన్నో కంపెనీలు ఇదివరకే దరఖాస్తు చేసుకున్నాయి. ఆ కంపెనీలకు భూములను కేటాయించకుండా రాష్ట్రవ్యాప్తంగా 10 ఫార్మా విలేజ్లను నెలకొల్పుతామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బలవంతంగా సేకరించాలని చూస్తున్న భూములు ఎవరికోసమో అంతుబట్టడంలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసిన మేడ్చల్ సిద్దిపేట ఇండస్ట్రియల్ జోన్, వర్గల్, ములుగు, కర్కపట్ల, బండ మైలారం, కర్కపట్ల, తునికిబొల్లారం, బండ తిమ్మాపూర్, మాదారం, కొండాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు-పాశమైలారం, ఇంద్రకరన్, రంగారెడ్డి-కొత్తూర్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, రాకంచెర్ల, సుల్తాన్పూర్, ఖమ్మం- బుగ్గపాడు, వరంగల్-మదికొండ, టెక్స్టైల్ పార్క్, యాదాద్రి-వెలిమినేడు, దండుమల్కాపూర్ తదితర ఇండస్ట్రియల్ పార్కుల్లో ప్రస్తుతం మిగిలివున్న భూముల కేటాయింపులో కొందరు అధికారులు, బయటి వ్యక్తులు చక్రం తిప్పుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాడు సాఫీగా కేటాయింపులు
గతంలో పరిశ్రమల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏండ్లలో వివిధ కంపెనీలకు 28,458 ఎకరాలు కేటాయించింది. టీజీఐఐసీ ద్వారా దాదాపు 21,921 యూనిట్లకు అనుమతులు జారీచేయడంతో రూ.2.66 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.