RRR | హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) భూసేకరణపై సందిగ్ధత వీడటంలేదు. పరిహారం విషయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సఖ్యత కొరవడినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న భూసేకరణ సమస్యపై చర్చించేందుకు గురువారం ఎన్హెచ్ఏఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో భేటీ అయ్యారు. ఎన్హెచ్ఏఐ చేపడుతున్న ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి ఇప్పటికే టెండర్లు పిలవగా, ఇంకా పలు ప్రాంతాల్లో భూసేకరణ పూర్తికాలేదు.
భూములకు బదులు భూములివ్వాలని, లేకపోతే బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ జారీచేసే నాటి ధర ప్రకారమే పరిహారం చెల్లించేందుకు నిబంధనలు అనుమతిస్తాయని ఎన్హెచ్ఏఐ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర భాగం పనులకు కాంట్రాక్టర్లు ముందుకొస్తారా లేదా అనేది అంతుబట్టడంలేదని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం నిర్మాణం తామే చేపడుతామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసింది. దక్షిణ భాగం పనులు కూడా చేపట్టాలని కోరుతూ ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది.
దక్షిణ భాగం అలైన్మెంటులో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. గతంలో ఖరారుచేసిన అలైన్మెంట్తో పోల్చితే కొత్త అలైన్మెంట్ 5 కిలోమీటర్ల వరకు పెరిగినట్టు తెలుస్తున్నది. దీంతో సేకరించాల్సిన భూములు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ మార్పులపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలని అధికారులు చెప్తున్నారు.
ఆర్ఆర్ఆర్ కోసం సేకరించే భూములకు పరిహారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలనే ఒప్పందముంది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిహారం పెంచే అవకాశంలేదని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ పరిహారం పెంచాలని నిర్ణయించినా ఆ మేరకు అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
పరిహారంపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టింది. రైతులు కోరుతున్న విధంగా పరిహారాన్ని కలెక్టర్లు నిర్ధారించినా ఆ మేరకు సగం భారం భరించేందుకు ఎన్హెచ్ఏఐ ఒప్పుకోవడంలేదు. గురువారం సీఎస్‌తో ఎన్హెచ్ఏఐ అధికారుల సమావేశంలోనూ స్పష్టత రాలేదని తెసుస్తున్నది. ఈ నేపథ్యంలో నేడు ఎన్హెచ్ఏఐ అధికారులు సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమవుతారని సమాచారం.