ఓవైపు నగరం నడిబొడ్డున పారిశ్రామిక అవసరాల కోసం అప్పగించిన రూ.లక్షల కోట్ల విలువ గల ప్రభుత్వ భూములను కేవలంరిజిస్ట్రేషన్ విలువలో 30 శాతానికే కాంగ్రెస్ సర్కార్ పెద్దలకు అప్పనంగా అప్పగిస్తున్నది. మరోవైపు కనీస ధర కూడా ఇవ్వకుండా రైతు ల సొంత భూములను పరిశ్రమల పేరు చెప్పి గుంజుకుంటూ.. ఇదేందని అడిగిన పాపానికి రైతులపైనే ఉల్టా కేసులు బనాయిస్తున్నది.
ఒక పారిశ్రామికవేత్త పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఉత్పత్తులు అందించి, పది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, దేశ ఆర్థిక వృద్ధిలో భాగస్వామి అవుతారు’ అనే ఏకైక కారణంతో గత ప్రభుత్వాలు రైతుల నుంచి భూములను సేకరించి నామమాత్రపు రేటుతో పరిశ్రమలకు కేటాయించాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చుతున్నది. మల్టిపుల్ జోన్లుగా మార్చి రైతుల భూములను బడా బాబులకు అగ్గువకే కట్టబెడుతున్నది. రాష్ట్రంలోని రైతులు ఆరుగాలం శ్రమించి ఆహారధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నారు. పది మందికి అన్నం పెడుతున్నారు. దేశ ఆహార భద్రతకు వెన్నెముకగా నిలుస్తున్నారు. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఆ పచ్చని భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం రైతులను వేధిస్తున్నది. భూములు ఇవ్వనంటే కేసులు పెట్టి, బేడీలు వేసి జైళ్లకు పంపుతున్నది. నష్ట పరిహారం రూపాయి ఎక్కువ ఇవ్వమని వేడుకున్నా కనీసం కనికరించడం లేదు. పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసి మరీ భూములను గుంజుకుంటున్నది.
(గుండాల కృష్ణ)
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ భూములను అగ్గువ సగ్గువ ధరకే అప్పనంగా బడాబాబులకు అంటగడుతున్న ప్రభుత్వం.. మరోవైపు రైతుల సొంత భూమిని మాత్రం పదో పరకో ఇచ్చి బలవంతంగా గుంజుకుంటున్నది. అదేమని అడిగితే రైతులను రోడ్డుకీడ్చి కేసులు పెడుతున్నది. ఫార్మా నుంచి ఓఆర్ఆర్ దాకా ఇదే తంతు! మరి పారిశ్రామికవేత్తలపై ఉన్న ప్రేమ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకొచ్చి హైదరాబాద్ మహా నగర పరిధిలో ఏకంగా 9,292 ఎకరాలను మల్టిపుల్ జోన్లుగా మార్చి పారిశ్రామికవేత్తలకు భూములను మూడోవంతు కన్నా తక్కువ ధరకే కట్టబెడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ చర్చే సాగుతున్నది. రైతుల భూములను గుంజుకోవడంలో కఠినంగా వ్యవహరిస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల విషయంలో మాత్రం రాయితీల పేరిట సబ్ రిజిస్ట్రేషన్ బుక్ విలువలో 30 శాతానికే అత్యంత విలువైన భూములను ధారాదత్తం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. చివరకు ఫార్మా సిటీని రద్దు చేసి రైతుల భూములను తిరిగి వారికి ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని నెరవేర్చకపోగా… పోలీసులను ప్రయోగించి వారి భూముల చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నది. దీనిని బట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ఎంత చులకనో అర్థమవుతుంది.
రైతులను నుంచి గుంజుకొని..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండేండ్లుగా హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్ల వరకు నిత్యం ఏదో ఒకచోట భూసేకరణ రగడ కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా నగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి, వికారాబాద్, నాగర్కర్నూల్, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లోని రైతుల కంటి మీద కునుకు కరువైంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రీన్ ఫార్మా సిటీ కోసం 14వేల ఎకరాలను సేకరించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి రాగానే ప్రాజెక్టును రద్దు చేసి ఈ భూములను రైతులకు తిరిగి ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు అడ్డం తిరిగారు. పైగా ‘అశ్వత్థామ హతః కుంజరః’ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఫార్మా సిటీని రద్దు చేసినట్టు ప్రకటించినా, హైకోర్టుకు మాత్రం ప్రాజెక్టును కొనసాగిస్తామని చెప్పింది. పైగా ఫ్యూచర్ సిటీ అంటూ మరో 16వేల ఎకరాల భూసేకరణకు కసరత్తు చేస్తున్నది. వీటికి తోడు గ్రీన్ఫీల్డ్ రోడ్డు, పరిశ్రమల ఏర్పాటు, గోశాల, ట్రిపుల్ ఆర్, ఇథనాల్ ఫ్యాక్టరీ, డంపింగ్ యార్డుతో పాటు ఇతర అనేక ప్రాజెక్టులకు వేలాది ఎకరాలను ప్రభుత్వం తీసుకుంటున్నది.
ఇందులో అత్యధికంగా ఒకటి రెండు ఎకరాలున్న సన్న, చిన్నకారు రైతులే ఉండగా, 90 శాతానికి పైగా భూములు పచ్చని పొలాలే. అయినా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూములను తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో అనేకచోట్ల బహిరంగ మార్కెట్ స్థాయిలో కాకున్నా నష్టపరిహారం ఇవ్వడంలో రూపాయి ఎక్కువ ఇవ్వాలని రైతులు కోరుతున్నా, ఎక్కడా రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలుగానీ, ఎక్కువ ఇచ్చేందుకు గానీ ప్రభుత్వపరంగా నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. పైగా లగచర్ల ప్రాంతంలో గిరిజన రైతుల ఇండ్ల మీదకు అర్ధరాత్రి పోలీసు బలగాలను పంపి, థర్డ్ డిగ్రీ ప్ర యోగించి మరీ జైలుకు పంపిన దృశ్యాలు ఇప్పటికీ రైతుల మదిలో మెదులుతూనే ఉన్నా యి. ప్రభుత్వం భూసేకరణ ప్రకటించిన భూ ముల్లో దాదాపు 30-40 శాతం మాత్రమే అసై న్డ్ భూములున్నాయి. మిగిలినవి రైతుల పట్టా భూములు. అంటే వారికి పూర్తిస్థాయిలో హ క్కులు ఉన్న భూములు. అయినా నిబంధనల పేరిట ప్రభుత్వం వాటిని గుంజుకుంటున్నది.
బడాబాబుల భోజ్యం
హైదరాబాద్ నగర పరిధిలోని 22 పారిశ్రామికవాడల్లో 9,292 ఎకరాలను అత్యంత చవకగా మల్టిపుల్ జోన్లుగా మార్చి బడాబాబులకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదేమని ప్రశ్నిస్తే.. కాలుష్యకారక పరిశ్రమలను అవుటర్ రింగు రోడ్డు అవతలికి పంపించేందుకు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకమని బుకాయిస్తున్నది. వాస్తవానికి ఈ భూములన్నీ గతంలో రైతుల నుంచి తీసుకున్నవే. కొన్ని ప్రభుత్వ భూములు అసైన్డ్ కింద రైతులు సాగు చేసుకుంటే పీవోటీ తీసుకున్న భూములు ఉన్నాయి. మరికొన్ని పట్టా భూములను కూడా పరిశ్రమల ఏర్పాటు కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఐసీ సేకరించి పరిశ్రమలకు కేటాయించింది. ఆ భూముల్లో కొన్ని మూతబడిన పరిశ్రమలు ఉండగా మరికొన్ని ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
ఇప్పుడు పరిశ్రమలన్నింటినీ మూసివేయాలనే నిర్ణయంతోనే హిల్ట్ పాలసీని తీసుకువచ్చారు. అయితే గతంలో నామమాత్రపు రేటుతో ఆ భూముల్ని పారిశ్రామికవేత్తలకు ఇచ్చినందున ప్రభుత్వం తిరిగి తీసుకునే వెసులుబాటు కూడా ఉన్నది. కానీ విక్రయ దస్తావేజులు అయినందున తిరిగి ఎలా తీసుకుంటామంటూ ప్రభుత్వ పెద్దలే సర్ది చెప్తున్నారు. మరి రైతుల పట్టా భూములను నిబంధనల పేరిట బలవంతంగా తీసుకుంటున్న ప్రభుత్వానికి గత ప్రభుత్వాలు నామమాత్రపు రేటు మీద ఇచ్చిన భూములను తిరిగి తీసుకునే అధికారం ఉండదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు ఆ భూముల్లో పారిశ్రామికవేత్తలతో కలిసి రియల్ ఎస్టేట్ దందా నడిపి రూ.లక్షల కోట్లు కురిపించాలనే ఆలోచనపైనే దృష్టిసారించారనేది బహిరంగ రహస్యం.
వివిధ ప్రాంతాల్లో భూముల విస్తీర్ణం, ధరలు

17