హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా లగచర్ల పరిసర గ్రామాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు పేరిట జరుగుతున్న భూసేకరణ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని, దీనికోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు లగచర్ల దుర్ఘటనలపై ఆయన బుధవారం ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. దళిత, గిరిజన బలహీనవర్గాల రైతుల భూములను దౌర్జన్యంగా గుంజుకోవడానికి ప్రయత్నిస్తూ.. తిరగబడిన వారిని జైళ్లలో వేస్తున్న దుర్ఘటనలపై రాష్ట్రపతి తక్షణం స్పందించాలని విజ్ఞప్తిచేశారు. లగచర్ల, పరిసర తండాల్లో దాదాపు 1,100 ఎకరాల పేదల సాగు భూములను సేకరించడానికి అక్రమంగా తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఫార్మాసిటీ కోసం 12,000 ఎకరాల భూమిని సేకరించి పెట్టిందని, అకడ అన్ని వసతులు ఉన్నా.. కేవలం వ్యక్తిగత లాభం కోసం ఫార్మా విలేజ్ల పేరుతో వాటిని లగచర్లకు మార్చారని తెలిపారు. పోలీసుల ద్వారా రైతులను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తూ అధికారుల అక్రమ భూసేకరణకు దిగుతున్నారని తెలిపారు. అర్ధరాత్రి రైతుల ఇండ్లపై దాడులు చేస్తూ, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ అక్రమ అరెస్టులు చేసి జైలులో వేశారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి బాధిత రైతుల ఇండ్లపైకి వందలాది మంది అసాంఘిక వ్యక్తులను తీసుకెళ్లి ‘మీ భూములు ఇవ్వకుంటే, తన్ని తీసుకుంటం’ అని బహిరంగంగా ప్రజలను బెదిరిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేయకుండా అనవసరమైన పనులతో ప్రజలను ముఖ్యమంత్రి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. లగచర్లలో మానవ హకుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సీఎంపై, ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరారు.