కొడంగల్, డిసెంబర్ 31 : ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం అధికారులు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంటతండాల్లో భూసేకరణకు సంబంధించి సర్వే పనులను మంగళవారం ప్రారంభించారు. హకీంపేటలోని 351 ఎకరాలకు సర్వే పనులను కొడంగల్, దుద్యాల తహసీల్దార్లు విజయ్‌కుమార్, కిషన్ ఆధ్వర్యంలో కొనసాగాయి. పట్టాదారులకు సంబంధించిన సర్వేనంబర్ ఆధారంగా భూములను గుర్తించారు. పట్టాపాస్ పుస్తకం ప్రకారం భూమి పోజిషన్లో ఉన్నారా? లేదా అనే వివరాలను తెలుసుకున్నారు. సర్వే నాలుగు రోజులపాటు కొనసాగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ సర్వేలో డిప్యూటీ తహసీల్దార్ వీరేశ్‌బాబు, ఆర్ఐలు నవీన్, రాఘవేందర్, వేణుతోపాటు సర్వేయర్లు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.