ఆదిలాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : ‘మా పొట్టగొట్టి పరిశ్రమలు పెడ్తరా? ఇప్పటికే ఒకసారి భూములిచ్చినం.. మరోసారి భూములెట్ల ఇయ్యాలి? మేం సాగు చేసుకొని బతుకాలా వద్దా? బలవంతంగా గుంజుకుంటే ఊరుకోం’ అని ఆదిలాబాద్‌లోని ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భూసేకరణ వ్యవహారంలో జరుగుతున్న కుట్రను బహిర్గతం చేస్తూ గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం ఆదిలాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది.
ఈ కథనం చదివిన రైతులు నివ్వెరపోయారు. సర్కార్ పన్నాగాన్ని ‘నమస్తే’ కుండబద్దలు కొట్టిందని రైతులు పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు వెనుక ఇంత మతలబు ఉన్నదా? అంటూ పెదవి విరుస్తున్నారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కలిస్తే ఆయన చెప్పిన మాటలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయంటూ పలువురు రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులో గల 10 వేల ఎకరాలను సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా భోరజ్ మండలం హత్తీఘాట్, గూడ, రాంపూర్, కొరాట, గిమ్మ గ్రామాల పరిధిలో 2,062 ఎకరాలను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ రహదారికి కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ఈ భూములు అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం భూ సేకరణ జరుగుతున్న గ్రామాల్లో 4 కిలోమీటర్లు వరకు బీటీ రోడ్లు ఉండగా ఆ రోడ్లను 120 ఫీట్ల మేర విస్తరిస్తే రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటుందని, ఆ తర్వాత మిగతా గ్రామాల్లో భూములు సేకరించాలనే ప్రభుత్వం భావిస్తున్నట్టు రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం సేకరించే భూములు బండలతో నిండి వ్యవసాయానికి పనికిరాకుండా ఉన్నాయని అధికారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో భాగంగా రెవెన్యూ, పరిశ్రమల శాఖ, టీజీ ఐఐసీ అధికారులు బాధిత గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. ఎకరాకు ధర రూ.3.37 లక్షలు ఉండగా, మూడు రేట్లు పెంచి చెల్లించే అవకాశాలున్నాయని రెవెన్యూ అధికారులు భూములు కోల్పోతున్న రైతులకు సూచించారు. ఇందుకు రైతులు ఒప్పుకోకపోగా రెండు పంటలు సాగు చేసుకొనే భూములకు తక్కువ ధర ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం మార్కెట్ ధర ఎకరాకు రూ.25 లక్షలకుపైగా ఉన్నదని చనాక, కొరాట ప్రాజెక్టు కాలువల ద్వారా వచ్చే సాగునీటితో తాము రెండు పంటలు సాగు చేసుకొనే అవకాశం ఉన్నదని రైతులు అంటున్నారు. అధికారులు బలవంతంగా భూములను లాక్కొనే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగా భోరజ్ మండలం కొరాటలో భూముల క్రయ,విక్రయాలు చేపట్టకుండా అధికారులు హోల్డ్‌లో పెట్టారని రైతులు మండిపడుతున్నారు. ఎకరాకు రూ.40 లక్షలియ్యాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లో చేతికి వచ్చే స్వల్ప కాలిక పంటలు మాత్రమే వేసుకోవాలని అధికారులు సూచించడంపైనా రైతులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు
ఎయిర్ పోర్టు వస్తే ప్యాసింజర్లుండాలి..
ఈ ప్రాంతంలో ఎర్రబస్సు తిరగడమే కష్టం. మా పాయల్ శంకర్, మా ఎంపీ నగేశ్.. ఈ ప్రాంతంలోని మా నాయకులు.. అన్నా, హైదరాబాద్‌కే ఎయిర్‌పోర్టా? ఆదిలాబాద్‌కు అక్కర లేదా? అని అడిగారు. కేంద్ర ప్రభుత్వంతో మోదీతో, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడినం. తొందరలోనే వీలైతే జూన్ 2వ తేదీ లోపల ఆదిలాబాద్‌లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలాఫలకాన్ని వేసే బాధ్యతను వేదికపై ఉన్న మిత్రలందరం తీసుకుంటం. మరి ఎయిర్‌పోర్టు వస్తే మరి అది నడవాలంటే మనకు ప్యాసింజర్లు ఉండాలి కదా. అందుకే ఈనాడు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగానే కాదు. పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని ఆదిలాబాద్ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో గొప్ప పారిశ్రామిక వాడ, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్‌కు మంజూరు చేసి.. ఈ ప్రాంతంలో ఉండే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇప్పించడానికి ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను ప్రారంభించడానికి త్వరలోనే మీ దగ్గరకు వస్తా.
– ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రిలో 6 ఏప్రిల్ 2026లో
ఎర్రబస్సే కష్టం ఆదిలాబాద్ గూడేలకు పోవడానికి.. ఇక్కడున్న పటేల్‌లు చాలామంది వస్తున్నరు. మిత్రులు పాయల్ శంకర్, ఎంపీ నగేశ్ ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన అంశాన్ని నా దృష్టికి తెచ్చారు. అందుకే ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్‌పోర్టు తీసుకువచ్చి.. ఎర్రబస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్‌పోర్టు తీసుకువచ్చి.. విమానాలను తీసుకువచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్‌లో పెద్దలు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీద ఎయిర్‌పోర్టును ప్రారంభించుకుందాం. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్‌పోర్టు కోసం శిలాఫలకం, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం. ఒక ఎయిర్‌పోర్టు ఉంటే మన ప్రాంత అభివృద్ధికి పూర్తిస్థాయి అవకాశాలు రావు. అందుకే ఈ ప్రాంతంలో రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసుకుందాం. ఇన్చార్జి మంత్రికి నేను చెప్పిన.. పదివేల ఎకరాల భూమిని ఆదిలాబాద్‌లో సేకరించాలని. దేశంలో ఉన్న ప్రతి పరిశ్రమను ఆదిలాబాద్ జిల్లాకు తీసుకువచ్చి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. అప్పుడే మీ జిల్లాకు వచ్చిన ఎయిర్‌పోర్టు, మీ జిల్లాకు వచ్చిన రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు ఈ జిల్లాల్లో చదువుల కోసం ప్రారంభించుకునే యూనివర్సిటీలు అన్నీ అభివృద్ధికి కేంద్రంగా మారుతాయి.
-చనాకా-కొరటా పంప్‌హౌస్ ట్రయల్న్ సందర్భంగా జనవరి 16న నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగలో..
ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో భాగంగా గిమ్మ(బీ) శివారులో భూములు కోల్పోతున్న కొరాట గ్రామ రైతులు ఇటీవల ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కలిశారు. ‘ఆల్రెడీ చనకా-కొరాట ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చినం. మాకు నీళ్లు వస్తే మా భూములు సాగైతయ్ అనుకున్నం. పంటలకు నీరు వస్తదనుకుంటే ఇప్పుడు ఆ భూములు సైతం కావాలంటున్నరు. ఇలా రెండోసారి భూములు పోతే మాకు రూ.40 లక్షలు నష్టపరిహారం ఇప్పియుండ్రి’ అని వారు ఎమ్మెల్యేను కోరారు. ‘ఈ ప్రాజెక్ట్ ఏమన్నా అయ్యేదా.. పోయేదా.. మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినా కూడా పదేండ్లు మనమే దున్నుకోవచ్చు. భూములైతే ఇవ్వక తప్పదు’ అని ఎమ్మెల్యే చెప్పారట. దీంతో ఎమ్మెల్యేను కలిసిన రైతులు బయటికి వచ్చి ఆయనపై దుమ్మెత్తి పోసినట్టు తెలిసింది. ‘ఒకసారి రిజిస్ట్రేషన్ చేశాక వాళ్లు ఎందుకు రానిస్తరు? సీసీఐ కింద భూములు తీసుకున్నాక రైతులను భూముల్లోకి పోనిచ్చారా? మనల్ని కూడా పోనివ్వరు’ అంటూ రైతులు రుసరుసలాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది.
– రైతులతో ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కారణంగా గ్రామంలో 150 కుటుంబాలు భూములను కోల్పోవడంతో ఉపాధి లేకుండా పోతున్నది. ప్రస్తుతం భూమి పోతే మరో చోట భూములు కొనే పరిస్థితులు లేవు. రూ.12 లక్షలకు ఎకరం భూమి కొనుగోలు చేస్తామని అధికారులు అంటున్నారు. ప్రాజెక్టు నీటితో రెండు పంటలు సాగు చేసుకొనే భూములకు ఇంత తక్కువ ధర చెల్లించడం సరికాదు. పదెకరాల భూమి ఉన్న రైతు రెండు సీజన్లలో రూ.10 లక్షల పంట పండిస్తారు. అధికారులు భూ సర్వే నిర్వహించినప్పటి నుంచి రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు మా పొట్టగొట్టి పరిశ్రమలకు భూములను అప్పగించే ప్రయత్నాలు మానుకోవాలి. ఎకరాకు రూ.40 లక్షల ఇస్తే భూములిస్తాం. బలవంతంగా లాక్కొనే ప్రయత్నాలు చేస్తే పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతాం.
– ఇందూర్ వామన్, రైతు, కొరాట. భోరజ్ మండలం