RRR | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్‌రోడ్డు(ట్రిపుల్ఆర్) ఉత్తరభాగం భూసేకరణలో ప్రతిష్టంభన నెలకున్నది. ప్రభుత్వం ఎకరాకు రూ. 12-15లక్షలు మాత్రమే పరిహారం ఆఫర్ చేస్తుండగా, బహిరంగ మార్కెట్ ధర చెల్లిస్తేనే భూములిస్తామని రైతులు స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టినందున రాష్ట్ర సర్కారు చొరవ తీసుకోవాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కోరుతున్నది. సుమారు 162 కిలోమీటర్లమేర ఏర్పాటు చేయనున్న ట్రిపుల్ఆర్ ఉత్తరభాగం కోసం 1,950 హెక్టార్ల భూములు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. భూములు, ఇతర ఆస్తులు కోల్పోయేవారికి రూ.5,100 కోట్ల పరిహారం అందించాల్సి ఉంటుందని గుర్తించింది. దాదాపు 85 శాతం భూసేకరణ పూర్తయింది. పరిహారం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.2,550 కోట్లు చెల్లించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,250 కోట్లు మాత్రమే కేటాయించింది.
ట్రిపుల్ఆర్ ఉత్తరభాగంలో భూములు కోల్పోతున్న రైతులు న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభు త్వం మాత్రం ముందుగా ఎకరాకు రూ.6 లక్షల చొప్పున ధర నిర్ణయించింది. రైతులు ముందుకురాకపోవడంతో రూ.12లక్షల నుంచి 15లక్షల వరకు ధర నిర్ణయించింది. ఈ ధరకు కూడా రైతులు ససేమిరా అంటున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరాకు రూ.40-50 లక్షల వరకు ధర పలుకుతుంటే ప్రభుత్వం రూ.12-15 లక్షల ఇస్తామనడం సరికాదని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు వదులుకునేదిలేదని తేల్చిచెప్తున్నారు. ఇప్పటికే కొందరు రైతులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే విధించింది.
పరిహారం రైతులు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పెంచే ప్రతిపాదనలేదని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల పరిశ్రమల కోసం భూ సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేశామని, ట్రిపుల్‌ఆర్‌లో పరిహారం పెంచితే మిగిలిన చోట్ల కూడా పెంచాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎన్హెచ్ఏఐ పరిహారం మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రైతు లు నిరాకరిస్తే భూసేకరణ చట్ట నిబంధనల మేరకు ఆ సొమ్మును కోర్టులో జమ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే టెండర్లు పిలిచిన ఎన్హెచ్ఏఐ, 3 నెలలు దాటినా బిడ్లను తెరవలేదు. కోర్టులో కేసులు పరిష్కారమయ్యాకే తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియ ఎప్పుడు కొలిక్కి వ స్తుందో, ట్రిపుల్ఆర్ పనులు ఎప్పుడు పట్టాలెక్కుతాయో అనేది సందిగ్ధంగా మారింది.