భద్రాచలం, సెప్టెంబర్ 28 : ఆదివాసీ అడవి బిడ్డల హక్కులను ప్రభుత్వాలు కాపాడాలని, వారికి న్యాయం చేయాలని ఆదివాసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది ఆదివాసీ గిరిజన సమూహాల జేఏసీ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ‘ఆదివాసీల ధర్మయుద్ధం’ పేరిట ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆదివాసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చుంచు రామకృష్ణ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్, జేఏసీ రాష్ట్ర నాయకుడు మోడెం శ్రీనివాసరావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పొదెం వీరయ్య మాట్లాడారు. 1976 రాజ్యాంగ సవరణ ద్వారా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో అసలైన ఆదివాసీలైన గోండు, కోయ, కోలాం వంటి తెగలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏజెన్సీ ప్రాంతంలో రిజర్వేషన్ల పేరుతో ఆదివాసీల హక్కులకు నష్టం కలిగిస్తున్న లంబాడీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పలు రాష్ర్టాల్లో బీసీలుగా ఉన్న లంబాడీలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎస్టీలుగా గుర్తించారని ఆరోపించారు. ఆదివాసీలకు లభించే అన్ని రిజర్వేషన్లను, సదుపాయలను లంబాడీలు పొందుతుండడంతో ఆదివాసీల్లో అభివృద్ధి జాడ లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి తరువాత ఆదిలాబాద్‌లో ఐదు రాష్ర్టాల ఆదివాసీలతో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఎస్టీ జాబితాపై సమీక్షించాలని, లేనిపక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సభలో 13 తీర్మానాలు చేసి ఆమోదించారు. బూర్గంపహాడ్ మండలం సారపాక నుంచి భద్రాచలంలోని బహిరంగ సభ వేదిక వరకు మూడు కిలోమీటర్ల మేర వేలాదిమంది ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు.