హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): బసవతారకం ట్రస్టు నిర్వహణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు రాసిన వీలునామా వ్యవహారంలో లక్ష్మీపార్వతికి చుక్కెదురైంది. 1995లో ఆ వీలునామాను సవరించినప్పుడు ధ్రువీకరించిన ఇద్దరు అటెస్టర్లు ప్రస్తుతం లేనందున ఆ వీలునామా ధ్రువీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం జరగాల్సిందేనని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ వీలునామా ప్రకారం తనను బసవతారకం ట్రస్ట్ మేనేజర్‌గా నియిమంచాలని కోరుతూ లక్ష్మీపార్వతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీంతో ఆ వీలునామాను ధ్రువీకరిస్తూ సంతకాలు చేసిన జే వెంకటసుబ్బయ్య, వై తిరుపతిరావు చనిపోయినందున వెంకటసుబ్బయ్య కుమారుడైన జేవీ ప్రసాదరావు సాక్ష్యాన్ని అనుమతించాలని సివిల్ కోర్టు నిర్ణయించింది. దీన్ని సవాలు చేస్తూ బసవతారకం మెమోరియల్ మెడికల్ ట్రస్టుతోపాటు ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ తదితరులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జీ రాధారాణి తీర్పు వెలువరించారు. నిబంధనలకు విరుద్ధంగా లక్ష్మీపార్వతి తీసుకొచ్చిన జేవీ ప్రసాదరావు సాక్ష్యం చెల్లదని స్పష్టం చేశారు.