అలనాటి రైతాంగ పోరాట పట్టు నేటి చైతన్య ఉద్యమమై కదిలినట్టు…
అప్పటి జగిత్యాల జైత్రయాత్ర జోరు ఇప్పటి జన సంద్రమై హోరెత్తినట్టు…
వరద కాలువ ప్రవాహానికి దీటుగా వాడవాడలా ప్రజలు పోటెత్తినట్టు…
ఉద్యమాలు ఉరుకు దారైన జిల్లాలో గుండె గుండెనే గులాబీగా విరిసినట్టు…
ఉడుకు నెత్తురు పారిన జగిత్యాలలో ప్రగతి రథ ధ్వని ప్రతిధ్వనించింది!
జగిత్యాల నేడు జనమై కనిపించింది జగిత్యాల నేడు జయమై వినిపించింది!!
జన జయ ధ్వానమై మెరిసి మురిసింది!!!
జగిత్యాల నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, డిసెంబర్ 7: జగిత్యాల జనసంద్రమైంది. కనీవిని ఎరుగనిరీతిలో జననేతను చూసేందుకు.. తమ ప్రియతమ నేతకు మద్దతు పలికేందుకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. జగిత్యాల గడ్డ భూమిపుత్రుడిని చూసి మురిసిపోయింది. బుధవారం జగిత్యాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన విజయవంతమైంది.
జగిత్యాలలో నిర్వహించిన సీఎం సభకు జనం పోటెత్తారు. అడుగడుగునా అధినేతకు స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు పోటీపడ్డాయి. తమ పట్టణానికి వచ్చిన రాష్ట్ర ప్రగతిసారథికి జగిత్యాల జనం వీధుల్లోకి వచ్చి గౌరవ సూచకంగా సంఘీభావం తెలిపారు. తమ నేతకు విజయచిహ్నం చూపుతూ ఉత్సాహపరిచేందుకు కొందరు ప్రయత్నించగా మరికొందరు గులాబీ జెండాలను చేతపట్టుకొని కనిపించారు. ‘జై కేసీఆర్ .. దేశ్ కీ నేత కేసీఆర్’ అంటూ నినదించారు. మరికొందరు యువత.. ‘దేశాన్ని మీరు నడిపించండి.. మేం మీ వెంటే ఉంటాం’ అంటూ నినాదాలు చేస్తూ కేసీఆర్ కాన్వాయ్‌ను అనుసరించారు.
కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు, జిల్లా టీజీవో, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వాగతం పలికారు. తమ జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరిగింది. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యేలు సంజయ్, రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, బాల్క సుమన్, సుంకె రవిశంకర్, చెన్నమనేని రమేశ్, ఉమ్మడి జిల్లాలోని జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, డీసీఎంఎస్, డీసీసీబీల అధ్యక్షులు ముఖ్యమంత్రికి సాదరస్వాగతం పలికారు. జిల్లాలో తొలి మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది అద్భుత ఏర్పాట్లు చేశారు. ఈ కాలేజీని కూడా సీఎం ప్రారంభించారు. దారిపొడవున ముఖ్యమంత్రి రాక సందర్భంగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. జగిత్యాల గులాబీవనంలా మారింది.
మోతె వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రికార్డు స్థాయిలో జనం హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌తో ఈ ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉన్నది. కేసీఆర్ ఎప్పుడు జిల్లాకు వచ్చినా అద్భుతంగా స్వాగతం పలికారు. ఈ సారి లక్షలాదిగా జనం తరలివచ్చారు. జగిత్యాల పట్టణం నలువైపులా జనంతో నిడిపోయింది. జగిత్యాలలో ఈ తరహాలో.. ఇంత పెద్ద ఎత్తున జనం హాజరైన సభ ఇప్పటివరకు జరుగలేదనడం అతిశయోక్తికాదు. కోరుట్ల, మెట్పల్లి వైపు నుంచి జగిత్యాల వైపు సుమారు 20 కిలోమీటర్లకుపైగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికి కార్లు, బస్సుల్లో సభకు వెళ్లేవారు అడుగు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది.
కరీంనగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు గంగాధర వద్దనే నిలిచిపోయాయి. ధర్మపురి వైపు నుంచి వచ్చే వాహనాలు నేరెళ్ల వద్ద, పెద్దపల్లి నుంచి వచ్చే వాహనాలు గొల్లపల్లి వద్దనే నిలిచిపోయాయి. ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కోపోయి, సభాస్థలిని చేరుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. మరోవైపు సభాస్థలి జనంతో కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంత మంది జనం వచ్చారు. జగిత్యాల జైత్రయాత్ర తదుపరి ఈ గడ్డపై జరిగిన అతిపెద్ద సభ ఇదేనని విశ్లేషకులు చెప్తున్నారు.
సభ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్.. హెలిప్యాడ్‌కు వెళ్లే మార్గంలో కూడా ప్రజలు తమ ఇండ్లలో నుంచి బయటకు వచ్చి ధన్యవాదాలు చెప్తున్నట్టుగా చేతులు ఊపుతూ వీడ్కోలు చెప్పారు. హెలిప్యాడ్ చుట్టూ ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అభివాదం చేశారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో కూడా సభకు వచ్చిన జనం సందోహం గురించి ప్రస్తావించారు. తాను కూడా ఇంతమంది వస్తారని ఊహించలేదని, మీ ప్రేమను, ఆశీర్వాదాన్ని ఇలాగే కొనసాగించాలని కోరారు.
కేసీఆర్ సభావేదిక వద్దకు చేరుకోగానే ప్రజలు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. సీఎం వేదికపైకి వచ్చిన వెంటనే గౌరవ సూచకంగా కూర్చున్నవారందరూ లేచినిలబడ్డారు. ‘కేసీఆర్ ఆగే బడో.. హమ్ ఆప్ కే సాథ్ హై’ అంటూ నినదించారు. సీఎం తన ప్రసంగం ప్రారంభంలోనే.. ‘భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస.. దుష్ట సంహార నరసింహ దురితదూర’ అంటూ శేషప్ప కవిని గుర్తు చేసుకొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పుష్కరాల సమయంలో తాను ధర్మపురికి వచ్చిన సందర్భాన్ని, అక్కడి బ్రాహ్మణోత్తములు, ధర్మపురి నరసింహస్వామి ఆశీర్వాదం ఎలా పనిచేసిందో చెప్పినపుడు సభికులు ఉత్సాహంగా ‘జై కేసీఆర్’ అంటూ నినదించారు. బండలింగాపూర్‌లో ఉద్యమ సమయంలో తాను పల్లెనిద్ర చేశానని, ఆ గ్రామాన్ని మండలంగా చేస్తానని అప్పుడు చెప్పానని, ఇప్పుడు మండలంగా చేస్తున్నానని ప్రకటన చేసినపుడు ప్రజలు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ సీఎం నిర్ణయాన్ని స్వాగతించారు. ఇక కొండగట్టు అంజన్న దేవాలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని, బాధ్యత నాదే, నేనే వస్తా అంటూ సీఎం చేసిన ప్రకటనకు మంచి స్పందన వచ్చింది.
కథలాపూర్ మండలంలోని సూరమ్మ చెరువును బాగుచేసే బాధ్యత తనదేనని, దీనికి అవసరమైన నిధులు కేటాయిస్తామని, మద్దుట్ల ఎత్తిపోతల పథకం చేపడుతామని సీఎం కేసీఆర్ చెప్పినపుడు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరో 5-6 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేస్తామని, రైతుల ఫోన్లకు టింగు.. టింగు మంటూ మెసేజ్‌లు వస్తాయని చెప్పినపుడు చప్పట్ల మోత మోగింది.
ఇక మేక్ ఇన్ ఇండియా పేరుతో బీజేపీ చేస్తున్న ప్రచారం.. మన ఊర్లలో వెలిసిన చైనాబజార్ల గురించి సీఎం కేసీఆర్ చెప్తున్నప్పుడు ప్రజలు ఆసక్తిగా విన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు కావాలా..? వద్దా..? అని సీఎం ప్రశ్నించడంతో ప్రజలు ముక్తకంఠంతో ‘వద్దే వద్దు’ అంటూ నినదించారు. మొత్తానికి సీఎం కేసీఆర్ సభ టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.
కేసీఆర్ సారు రాష్ర్టాన్ని మంచిగ పరిపాలిస్తున్నడు. నెలనెలా టంచన్‌గా పింఛిన్లు ఇస్తున్నడు. సంది సంది తిరిగి కూరగాయలు అమ్మే మా అసోంటోళ్లకు కూరగాయల మార్కెట్ల మంచిగా సౌలత్ చేసిండు. తిరిగి కూరగాయలు అమ్మే బాధ తప్పింది. మార్కెట్లనే కూసుండి అమ్ముతున్న. నా అసోంటి చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటోళ్లకు కూసునేటందుకు మంచి జాగ సూపెట్టిండు. జైతాల జిల్లాగా అయిన తర్వాత ఊళ్లె నాలుగు కూరగాయల మార్కెట్లు చేయించిండు.
– మిర్యాల దేవక్క, జగిత్యాల
సీఎం కేసీఆర్ లాంటి రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. ఎనిమిదేండ్లలోనే ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సీఎం కేసీఆర్ పలు రాష్ర్టాల మన్ననలు పొందారు. సంక్షేమం, అభివృద్ధి మాత్రమే కాకుండా రైతులకు కూడా కేసీఆర్‌తో మంచి జరుగుతున్నది.
– గుంటి దేవయ్య, ఫకీర్ కొండాపూర్, ఇబ్రహీంపట్నం మండలం