కరీంనగర్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ఏడాదిన్నర స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ పతనమైపోయిందని, రేవంత్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో శుక్రవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్టీ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి భారీ జన సమీకరణ జరుగుతున్నదని, జిల్లా నలుమూలల నుంచి ఎల్కతుర్తికి వెళ్లే వాహనాలకు రూట్ మ్యాపులు ఇస్తున్నామని చెప్పారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి 1.50 లక్షల మంది తరలింపు: గంగుల
రజతోత్సవ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 1.50 లక్షల మందిని తరలిస్తున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. ఇందుకోసం ఇప్పటికే 400 ఆర్టీసీ బస్సులు, 200 ప్రైవేట్ స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు బుక్ చేసినట్టు తెలిపారు. అవి కూడా సరిపోకపోవడంతో మహారాష్ట్ర నుంచి కూడా బస్సులు బుక్ చేసుకున్నామని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం జిల్లాకు వచ్చి పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో జిల్లా పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం లేదని, మానేరు రివర్ ఫ్రంట్ పనులను నిలిపివేశారని చెప్పారు. వచ్చే జూన్ వరకు పనులు పూర్తి చేసి రివర్ ఫ్రంట్‌లో నీళ్లు ఆగేలా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, కనుమల్ల విజయ, నాయకులు అక్బర్ హుస్సేన్, చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.