Lagcherla | ‘అయ్యా బాంచెన్!.. అర్ధరాత్రి ముందుగనే లైట్లు తీసేసిండ్రు. మందలకొద్ది పోలీసులు, వాళ్ల వెనుక గుర్తు తెలియని వ్యక్తులు ఇండ్లలోకి జొరబడ్డరు. తలుపులు తియ్యకపోతే గడ్డపారలతో పగులగొట్టి ఇంట్లకొస్తమన్నరు. మాకేం జరుగుతుందో అర్థంకాలె. భయపెట్టిండ్రు. తలుపులు తీసిన ఇండ్లలోకి పొయ్యి.. ఆడోళ్లను ఇక్కడ (ఎదను చూపిస్తూ) తాకుతూ, చిమ్మ చీకట్ల ఇట్ల.. ఇట్ల పిసుకుతూ (ఉబికి వస్తున్న కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ) ఆగమాగం చేసిర్రు. కొందరైతే మా ముందల్నే బిడ్డల చేతులు బట్టుకొని చెరిచేందుకు ప్రయత్నించిండ్రు. ………….. ఇది లగచర్ల బాధిత మహిళల మాట. రైతులు తిరగబడిన నాటి రాత్రి జరిగిన అరాచక కాండను శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు వివరిస్తూ వారు కన్నీటి పర్యంతమయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): లగచర్లలోని గిరిజన ఆడబిడ్డలపై పోలీసుల దాష్టీకాలు ఒక్కొక్కటీ ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. అర్ధరాత్రి తండాలో కరెంట్ తీసేసి, చిమ్మచీకట్లో ఆడబిడ్డల ఛాతీల మీద తడుముతూ, బూటు కాళ్లతో తొక్కుతూ పోలీసులు, కొందరు ప్రైవేటు వ్యక్తులు చేసిన దారుణాలు బయటికొస్తున్నాయి.
చిమ్మ చీకట్లలో చేతులతో స్తనాలను తడిమి.. అడ్డొచ్చినోళ్ల గొంతులు నులిమి.. ఇదేమిటని ప్రశ్నించిన ఆడబిడ్డల తొడలు కమిలేలా.. నుదురు చిట్లేలా.. కొట్టిన అరాచకాలు బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. అరెస్టుల పేరుతో ఊరు మీద పడ్డ పోలీసులు, ప్రైవేట్ సైన్యం అడ్డగోలుగా దుర్భాషలాడుతూ, డొకల్లో తన్నుతూ, లైంగిక హింసను ప్రేరేపించేలా అర్ధరాత్రి నిర్లజ్జగా, అత్యంత వికృతంగా, అనాగరికంగా ప్రవర్తించిన తీరును కండ్లకు కట్టినట్టు చెప్పేందుకు బాధిత కుటుంబాలు బయటికొచ్చాయి.
11న సోమవారం రోజు అర్ధరాత్రి జరిగిన అరాచకాలపై నోరువిప్పుతూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పెద్ద అన్నదమ్ముల అరాచకాలను, ఆ రోజు పోలీసులు, వారితోపాటు వచ్చిన కొందరు ‘ప్రైవేట్ సైన్యం’ వికృతంగా ప్రవర్తించిన తీరును కండ్లకు కట్టినట్టు వివరించారు. పక్కమీద పడుకున్న వారిని అలాగే పెడరెక్కలు విరిచిపట్టి, కొట్టుకుంటూ వ్యాన్లలో పడేసిన దౌర్జన్యకాండను హైదరాబాద్లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయం సాక్షిగా మీడియా ఎదుట బాధితులు కన్నీటిపర్యంతమవుతూ వివరించారు.
‘అర్ధరాత్రి ఒంటిగంటకు వందలమంది పోలీసులొచ్చిండ్రు. లాఠీలతోని తలుపులు పటా పటా కొడుతుండ్రు. మా ముసలోడు ఎవరయ్యా అంటే.. ‘ఏయ్ ముసలోడా సప్పుడు చెయ్యకు’ అని లాఠీలతోని బెదిరిస్తే. గమ్మునుండు. తలుపు తీసిన మా కోడలిని చెప్పలేని మాటలతో తిట్టుకుంట పోలీసులే లాఠీలతో కొట్టిర్రు. చిమ్మ చీకట్లలో ఆడబిడ్డల ఎదలమీద చేతులేసి అసభ్యంగా చేసిర్రు (ఏడ్చుకుంటూ).. ఆ దుర్మార్గాన్ని అడ్డుకోబోతే లాఠీలతో నన్నుకొడితే నా తలకు దెబ్బ తల్గి నెత్తురొచ్చింది.
– లక్ష్మీబాయి, పులిచర్లకుంట తండా
అర్ధరాత్రి ఇండ్లలోకి వచ్చి గొడ్లను బాదినట్టు బాదిర్రు. తలుపు తియ్యకపోతే తాళాలు పగలగొట్టిండ్రు. మగోళ్లు లేని ఇండ్లకు జొర్రి.. చెప్పుకోలేని ఇబ్బందులు పెట్టిర్రు. వాళ్లు పగలొచ్చినా ఇంత భయపడే వాళ్లం కాదు. ఒంటిగంటకు ఒక్కో ఆడోళ్ల మీదకు 10 మంది పోలీసులు వచ్చిర్రు. నన్ను కొడితే కాళ్లు, తొడలు కమిలి పోయినయ్. ఈ దెబ్బలు బయటికి చూపిస్తే.. నన్నేం జేస్తరోనని ఇన్నిరోజులు చెప్పుకోలే. 4 రోజులైనా కొట్టిన దెబ్బ తగ్గలేదు. నల్లగా కమిలిపోయింది చూడండి (బోరున విలపిస్తూ.. తొడపై కమిలిన లాఠీ దెబ్బలు చూపుతూ).
– లక్ష్మీబాయి కోడలు
ఇంత జరుగుతున్నా రేవంత్రెడ్డి మా ఊరు రాలేదు. గొడవలన్నీ అయిపోయినంక మా ఊరికి వస్తడా? ఆయన అన్నని తోలిండు. ఆయనేమన్న ఎమ్మెల్యేనా? ఎలాగైనా ఫార్మా కంపెనీని తీసుకొస్తామని చెప్పేటందుకు ఆయనెవరు? మావోళ్లను జైళ్లేసిండు. ఎందుకు తెస్తడు?
– గోపీబాయి, లగచర్ల
అసలు తిరుపతిరెడ్డి మాటిమాటికి ఎందుకొస్తుండు? ఆయన ఎవనికి ఎంపీ, ఎమ్మెల్యే? కూలిపని చేసుకుంటూ బతికే వాళ్లమే సార్. రేవంత్రెడ్డి సార్ మంచి చేస్తడేమోనని ఓట్లేస్తే.. మమ్మల్ని తొక్కి పెడ్తున్నడు. నా బిడ్డకు ఒంట్లో బాగోలేకపోతే హాస్పట్లకు తీస్కపోయి సాయంత్రమొచ్చిన. గొడవ జరిగిందే తెలియదు. లైట్లు బంజేసి, కొట్టుకుంటూ కొడుకును తీస్కపోయిండ్రు. (ఏడ్చుకుంట)
– మున్నిబాయి, లగచర్ల
మా భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు. వికారాబాద్ కలెక్టరేట్ ఆఫీసు ముందు అందరం పెట్రోల్ పోసుకొని చస్తాం. ఇదంతా కలెక్టర్ రావట్టే అయింది. ఆయనే చేస్తుండు తాకట్లు.. ఆయన వచ్చినప్పటి నుంచే కదా ఈ లొల్లి. మేము ఏం దోచుకున్నమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నరు? మమ్మల్నెవరూ ఉసిగొల్పలే.
– దేవీబాయి, బాధితురాలు
ఫార్మా సిటీ భూముల కోసం ఎవ్వలెవ్వలోనో ఎందుకు పంపుతున్నవ్ సీఎం గారూ? మీకు దమ్ముంటే మీరే రావాలె. నువ్ మాకు బాగు చేస్తనంటేనే నీకు ఓట్లేసినం. ఇట్ల ఆగం చేస్తవనుకోలే. మాకు 4 వేల పింఛను రాకపాయె.
– సోనీబాయి, లగచర్ల