హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రైతులు, ప్రజలకు నష్టం జరగకుండా పరిశ్రమల ఏర్పాటుకు భూ సేకరణ చేయాలని, ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ జరపడం అప్రజాస్వామికమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పార్టీ నేతలు జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్యతో కలిసి తమ్మినేని మీడియాతో మాట్లాడారు. లగచర్లలో భూసేకరణ విషయంలో ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించలేదని విమర్శించారు. గతంలో ఫార్మా సిటీని వ్యతిరేకించిన సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు లగచర్లలో భూ సేకరణ జరపడం ఏమిటని ప్రశ్నించారు.
విదేశీ సంస్థలకు
గతంలో రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ కోసం 15 వేల ఎకరాలు సేకరించారని తమ్మినేని వీరభద్రం గుర్తుచేశారు. ఆ ఫార్మా సిటీని రద్దు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు లగచర్లలో ఫోర్త్‌సిటీ పేరుతో రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకోవడం తగదని పేర్కొన్నారు. విదేశీ కంపెనీల ద్వారా ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పడం విదేశీ కంపెనీలకు భూములు అప్పగించడమేనని ఆరోపించారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు తమ భూములను తీసుకుంటే జీవనోపాధి కోల్పోతామని ఆవేదనతో ఉన్న రైతులను.. కలెక్టర్‌పై దాడి నెపంతో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దారుణం అని తమ్మినేని విమర్శించారు. నిర్బంధాలతో గ్రామాన్ని జైలుగా మార్చి ప్రజలను, రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. గతంలో నిర్భందాలు విధించిన వాళ్లు రాజకీయంగా ఏమయ్యారో గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. లగచర్ల ఘటనలో వాస్తవాలను తెలుసుకొనేందుకు ఈ నెల 21న సీపీఎం ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల నేతలు, ప్రజాసంఘాలు గ్రామాన్ని సందర్శించనున్నట్టు తమ్మినేని తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లా రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని సీపీఎం రాష్ట కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఇప్పటికే దీనిపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకించినట్టు చెప్పారు. ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సీపీఎం వ్యతిరేకం కాదని, ప్రజలకు, రైతులకు ఇబ్బంది, నష్టం జరగని ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని సూచించారు.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): మూసీ పక్షాళన చేయాలంటే ఇరు వైపుల ఉన్న 12 వేల ఇండ్లను కూల్చాల్సిన అవసరం లేదని, మూసీకి రెండు వైపులా ఎత్తుగా గోడలు కడితే సరిపోతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య సూచించారు. మూసీ నిర్వాసితులకు ముందుగా ప్రభుత్వం ఇండ్లను నిర్మించి, నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే వారిని అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా నిర్వాసితులైన లంబాడీ గిరిజనులు ఇప్పటికీ పునరావాసాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీరయ్య గుర్తుచేశారు.