కందుకూరు, నవంబర్ 18: లగచర్ల ఘటనలో గిరిజనులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, జైలు నుంచి విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు చిలకమర్రి నర్సింహ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో సోమవారం ఆయన మాట్లాడారు. అమాయక గిరిజనులపై ప్రభుత్వం కేసులు పట్టి వేధిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వం తమ భూములను లాక్కుంటే జీవనోపాధి కోల్పోతామనే భయంతోనే గిరిజనులు అధికారులకు అడ్డుపడ్డారని తెలిపారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల ముసుగులో గిరిజనులను రెచ్చగొట్టి అధికారులపై చట్టవ్యతిరేకంగా ఉసిగోల్పారని ఆరోపించారు. పోలీసులు రాత్రివేళ ఇండ్లల్లోకి వెళ్లి అరెస్టు చేసి గిరిజనులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పేర్కొన్నారు. పేదల భూములను సేకరించే పక్రియను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సూచించారు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయొద్దని హితవు పలికారు.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): లగచర్ల రైతుల తిరుగుబాటు కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాధిత రైతు సురేశ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మేరకు సోమవారం అతనిపై పోలీస్‌శాఖ లుకౌట్ నోటీస్ జారీచేసింది. సురేశ్ దొరికితే అతని ద్వారా ఏమైనా నిజాలు వస్తాయోమోనని పోలీసులు భావిస్తున్నారు. ఒకవైపు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు లగచర్లలో పర్యటించి అక్కడి దారుణ పరిస్థితులను మీడియాకు వివరించారు. దీనికితోడు తమ గోడు వెలిబుచ్చేందుకు లగచర్ల బాధిత గిరిజన రైతు కుటుంబాలు ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో పోలీస్ శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే తిరుగుబాటు చేసిన 25 మంది రైతులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించింది కొత్తగా ఎవరినీ అరెస్టు చేయొద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆదేశించడంతో పోలీస్ శాఖ డైలమాలో పడింది.