హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ మహిళా కండక్టర్ బస్సులో గర్భిణికి పురుడుపోసి మానవత్వం చాటుకున్నది. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా గద్వాలకు చెందిన నిండు గర్భిణి సంధ్య సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్లేందుకు పల్లెవెలుగు బస్సు ఎక్కింది. బస్సు నాచహళ్లికి చేరగానే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి.
అప్రమత్తమైన మహిళా కండక్టర్ జీ భారతి బస్సును ఆపించింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ నర్సు సాయంతో గర్భిణికి పురుడుపోశారు. పండంటి ఆడబిడ్డ జన్మించింది. అనంతరం 108సాయంతో తల్లీబిడ్డలను స్థానిక దవాఖానకు తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. విధుల్లో ఉండి సాటి మహిళకు పురుడుపోసి మానవత్వం చాటిన కండక్టర్‌కు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.‘శభాష్ భారతి’ అంటూ ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.