తెలంగాణ పునర్జన్మించి ఏడేండ్లే అయింది. అంతకుముందటి తెలంగాణకు.. ఇప్పటి తెలంగాణకు ఏదైనా పోలిక ఉన్నదా? అంతకుముందు యాభై అరవై ఏండ్లనుంచి ఉన్న రాష్ర్టాలతో పోల్చుకొంటే.. ఆశ్చర్యమేస్తుంది? అనుమానాలు, అవహేళనలు పటాపంచలయ్యాయి. యావత్ దేశమే ఇవాళ ఆశ్చర్యపోతున్నది. ఎవరూ ఊహించలేదు. ఇతర రాష్ర్టాల కంటె ఎన్నెన్నో రెట్లు ప్రగతిపథంలో తెలంగాణ దూసుకుపోతున్నది. వ్యవసాయం ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా మారింది. నీటిపారుదల, పారిశ్రామిక అభివృద్ధి.. ఒకటేమిటి.. ఒకపక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మరో పక్క పట్టణ ఆర్థిక వ్యవస్థ సమాంతరంగా పరుగులు పెడుతున్నాయి. ఏడేండ్లలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే అభివృద్ధిలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ దూరదృష్టి.. టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసిన కార్యాచరణ ఫలితంగా దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా కీర్తిని గడించింది. దాదాపు అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది. సొంత రాబడుల్లో ఇతర రాష్ర్టాలకు అందనంత ఎత్తులో నిలిచింది. వ్యవసాయం, విద్యుత్తు, పరిశ్రమలు, ఐటీ ఇలా.. అన్ని రంగాల్లోనూ రెట్టింపు వృద్ధిని సాధించింది. గతంలో దండగ అనుకున్న వ్యవసాయం.. నేడు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఇంజిన్‌గా మారింది. ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (ఎంవోపీఐఎస్) ఇటీవల అందుబాటులో ఉన్న 18 రాష్ర్టాలు వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై విడుదల చేసిన నివేదికల్లోనివే. దీంతోపాటు ఇతర కేంద్ర సంస్థలు, ప్రపంచ బ్యాంకు నివేదికల ఆధారంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ‘తెలంగాణ ఏడేండ్ల ప్రగతి నివేదిక’ను సిద్ధంచేసింది. దీనిని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం విడుదలచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఏడేండ్లలోనే అనూహ్య వృద్ధిని సాధించినట్టు స్వయంగా కేంద్రమే ఒప్పుకొన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో రాష్ట్రం ఏటికేడు స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నదని వెల్లడించారు.
2020-21లో తలసరి ఆదాయం (రూ.) తెలంగాణ వర్సెస్ ఇతర రాష్ర్టాలు
ఉత్పత్తి రంగం గత ఏడేండ్లలో ఏకంగా 72 శాతం వృద్ధి కనబరిచింది. నిర్మాణ రంగం సైతం జీఎస్డీపీలో మూడేండ్లుగా ఏటా రూ.37 వేల కోట్ల వాటాను నమోదు చేస్తున్నది. మైనింగ్, క్వారీయింగ్ రంగం వాటా రెట్టింపయ్యింది.
ఆర్థిక వృద్ధి ఇంజిన్‌గా వ్యవసాయం
వ్యవసాయం (అనుబంధ రంగాలతో కలిపి) ఏడేండ్లలో రాష్ర్టాభివృద్ధికి ఇంజిన్‌గా మారింది. జనాభాలో సగంమందికి ఉపాధి కల్పిస్తున్నది. జీఎస్డీపీలో వ్యవసాయ రంగ ఉత్పత్తుల విలువ ఏడేండ్లలో 142 శాతం పెరిగింది. రైతుబంధు, బీమా వల్ల ఈ ప్రగతి సాధ్యపడింది.
రాష్ట్రంలో పండిన పంటల విలువ 2014-15లో రూ.41,706 కోట్లు కాగా, 2020-21 నాటికి రూ.80,574 కోట్లకు పెరిగింది. అంటే..తెలంగాణలో పంటలు దాదాపు రెట్టింపయ్యాయి. ముఖ్యంగా వరి పంట ఐదు రెట్లు, పత్తి మూడు రెట్లు పెరిగింది. పత్తి సాగు విస్తీర్ణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నది.
ఐటీ ఎగుమతుల్లో 120% శాతం వృద్ధి నమోదైంది. కొవిడ్ సమయంలోనూ రాష్ట్ర ఐటీ ఎగుమతుల్లో అనూహ్య వృద్ది కనిపించడం విశేషం. 2018-19తో పోల్చితే 2019-20లో అదనంగా రూ.19,588 కోట్లు, 2019-20తో పోల్చితే 2020-21లో అదనంగా రూ.16,715 కోట్ల ఎగుమతులు జరిగాయి. ఐటీ రంగం సగటున ఏటా 14% వృద్ధిని నమోదు చేసింది. 2014-15లో ఐటీ ఆధారిత ఉద్యోగులు 3.71 లక్షల మంది ఉండగా, ఇది 2020-21 నాటికి 6.28 లక్షలకు పెరిగింది.
2014-15తో పోల్చితే 2020-21 నాటికి రాష్ట్ర జీఎస్డీపీ దాదాపు రెట్టింపయ్యింది. ఏటా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్థిరమైన వృద్ధిని సాధించింది. 2014-21 మధ్య జీఎస్డీపీ వార్షిక వృద్ధి రేటు సగటున 11.7 శాతంగా ఉన్నది. అదేసమయంలో దేశ జీడీపీ వార్షిక వృద్ధిరేటు 8.1 శాతానికే పరిమితం అయ్యింది. అత్యధిక సగటు వృద్ధిరేటు సాధించిన రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంలో ఉన్నది. ఇదే సమయంలో దేశ జీడీపీ పెరుగుదల కేవలం 58.4 శాతంగా నమోదైంది. జాతీయ పెరుగుదలతో పోల్చితే తెలంగాణ 35.4 శాతం అధికంగా వృద్ధిని సాధించింది. సగటున జాతీయ సగటు కన్నా 3.7 పర్సంటేజ్ పాయింట్లు ఎక్కువ సాధించింది. కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మెరుగ్గా ఉన్నదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
తలసరి ఆదాయంలో మూడోస్థానం
ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, జాతీయ తలసరి ఆదాయం రూ.1,28,829 కే పరిమితం అయ్యింది. తెలంగాణలో 1.84 రెట్లు అధికంగా ఉన్నది. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ర్టాల్లో మూడో స్థానంలో నిలిచింది.
రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రజల తలసరి ఆదాయం రూ.1,24,104 కాగా 2020-21 నాటికి రూ.2,37,632కు పెరిగింది. ఏడేండ్లలో 91.5 శాతం వృద్ధి నమోదైంది. అత్యధిక వృద్ధిని సాధించిన రాష్ర్టాల్లో రెండో స్థానంలో నిలిచింది. జాతీయ తలసరి ఆదాయం రూ.86,647 నుంచి రూ.1,28,829కి పెరిగింది. వృద్ధిరేటు 48.7 శాతం మాత్రమే.
తలసరి ఆదాయం వార్షిక వృద్ధిలో 2014-15లో తెలంగాణ, జాతీయ గణాంకాల్లో 1.1% మాత్రమే తేడా ఉండేది. ఇప్పుడది 5.8%కి పెరిగింది. కరోనా సమయంలో తలసరి ఆదాయం 1.8% ఉండగా, జాతీయ వృద్ధి మాత్రం 4%కి పడిపోయింది.
ఏడేండ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం సగటున 11.5 శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేసింది. ఇదే సమయంలో జాతీయ సగటు వృద్ధి కేవలం 7 శాతంగా ఉన్నది. సగటు వృద్ధిరేటులో తెలంగాణ దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నది. ఏపీ (10.5 శాతం), కేరళ (10.4 శాతం), కర్ణాటక (9.8 శాతం), తమిళనాడు (9.7 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
2014-15లో దేశంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ 10వ స్థానంలో ఉండేది. 2020-21 నాటికి మూడో స్థానానికి ఎదిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 18 రాష్ర్టాల డాటా ప్రకారం సిక్కిం (రూ.4,24,454), హర్యానా (రూ.2,39,535) మాత్రమే మనకన్నా ముందున్నాయి. ఈ క్రమంలో 2015-16లో గుజరాత్‌ను, 2016-17లో తమిళనాడును, 2017-18లో మహారాష్ట్రను 2018-19లో కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్లను, 2020-21లో హిమాచల్ ప్రదేశ్‌ను దాటేసింది.
సగటు ఆర్థిక వృద్ధిరేటు 11.7 శాతం
ఆర్థిక వృద్ధి రేటులోనూ తెలంగాణ దూకుడు ప్రదర్శిస్తున్నది. 2014-15లో తెలంగాణ వృద్ధిరేటు 12 శాతంగా ఉండగా, జాతీయ వృద్ధి రేటు 11 శాతంగా నమోదైంది. ఏడేండ్ల తర్వాత 2020-21లో తెలంగాణ జీఎస్డీపీ వృద్ధిరేటు 2.4 శాతంగా నమోదుకాగా.. దేశ జీడీపీ వృద్ధిరేటు రుణాత్మక దిశలో – 3 శాతంగా నమోదైంది. వ్యత్యాసం ఐదు శాతానికి పెరిగింది. సగటు వార్షిక ఆర్థిక వృద్ధిరేటు 11.7 శాతంగా ఉండగా, జాతీయ సగటు 8.1 శాతంగా నమోదైంది.
జీడీపీలో పెరిగిన మన వాటా
‘దేశాన్ని సాకుతున్న నాలుగైదు పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి’ అని సీఎం కేసీఆర్ తరుచూ చెప్తుంటారు. దీనికి కేంద్ర ప్రభుత్వ లెక్కలే నిదర్శనం. మన జీఎస్డీపీ పెరుగటమే కాదు.. జీడీపీలో వాటాను క్రమంగా పెంచుకొన్నది. 2014-15లో దేశ జీడీపీలో తెలంగాణ జీఎస్డీపీ వాటా 4.06 శాతం కాగా, ఇప్పుడది 4.97 శాతానికి పెరిగింది. జీడీపీలో అత్యధిక వాటా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఆరోస్థానంలో ఉన్నది.
అదుపులోనే అప్పులు
రాష్ట్ర ఆదాయం పెరుగడమే కాదు.. అప్పులు కూడా అదుపులోనే ఉన్నాయి. రాష్ట్ర జీఎస్డీపీలో 25 శాతానికి మించి అప్పులు ఉండొద్దన్నది కేంద్రం నిబంధన. ఈ ఎఫ్ఆర్బీఎం పరిధిని తెలంగాణ ఏనాడూ దాటలేదు. ప్రసుతం తెలంగాణ జీఎస్డీపీలో రాష్ట్ర అప్పులు 22.83 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో దేశంలోని 18 రాష్ర్టాల అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిమితికి మంచి నమోదయ్యాయి. తెలంగాణ 25వ స్థానంలో ఉన్నది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర మాత్రమే తెలంగాణ కన్నా తక్కువగా అప్పులు చేశాయి.
దేశంలోనే ధనిక రాష్ట్రంగా చెప్పుకొనే పంజాబ్ ఏకంగా 38.67% అప్పులు చేసింది. రుణాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది.
బీజేపీ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, గోవా, హర్యానా వంటి రాష్ర్టాలన్నీ ఎప్పుడో ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటేశాయి.
పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఏపీ, కేరళ, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ర్టాలు సైతం పరిమితికి మించి రుణాలు తీసుకున్నాయి.
సొంత పన్ను రాబడుల పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2014-15తో పోల్చితే సొంత రాబడులు 90 శాతం పెరిగాయి. వార్షిక సగటు వృద్ధి 11.52 శాతంగా నమోదైంది. మిగతా రాష్ర్టాలకు అందనంత ఎత్తులో ఉన్నది. ఈ జాబితాలో 9.78 శాతంతో ఒడిశా రెండో స్థానంలో 8.9 శాతం వృద్ధితో జార్ఖండ్ మూడో స్థానంలో నిలిచాయి. గుజరాత్లో వార్షిక సగటు వృద్ధి 2.59 శాతంగా నమోదైంది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం వల్ల పశుసంపద మూడు రెట్లు పెరిగింది. 2014-15లో రాష్ట్రంలోని పశుసంపద విలువ రూ.29,282 కోట్లు కాగా, 2020-21 నాటికి రూ.94,211 కోట్లకు చేరింది. రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే మాంసం విలువ మూడు రెట్లు పెరిగింది. చేపలు, రొయ్యలు, గుడ్ల ఉత్పత్తి రెట్టింపయ్యింది. మత్స్య సంపద రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో రూ.2,670 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.5,254 కోట్లకు పెరిగింది. ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడం వంటి చర్యల ఫలితంగా ఈ మార్పు కనిపించింది. 2013-14లో 4.46 లక్షల మిలియన్ టన్నుల మాంసం ఉత్పత్తి కాగా, 2019-20 నాటికి ఇది 8.48 లక్షల టన్నులకు పెరిగింది. 90% వృద్ధి కనిపించింది.
తెలంగాణ గత ఏడేండ్లలో అన్ని రంగాల్లోనూ అనూహ్య వృద్ధి సాధించింది. ముఖ్యంగా ప్రాథమిక రంగం కరోనా విపత్తును ఎదుర్కొని అత్యధిక వృద్ధిని నమోదుచేసింది. జాతీయ సగటుతో పోల్చినప్పుడు ప్రాథమిక రంగం, సేవారంగంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. రంగాలవారీగా అభివృద్ధిని పరిశీలిస్తే..
1 ప్రాథమిక రంగం
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పశుసంవర్ధకం, అటవీ పర్యావరణ, మత్స, ఆక్వా కల్చర్, మైనింగ్ వంటి రంగాలు ప్రాథమిక రంగం కిందికి వస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 55 శాతం ప్రజలకు ప్రాథమిక రంగమే ఉపాధి కల్పిస్తున్నది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఫలితంగా రాష్ట్ర జీఎస్డీపీలో ప్రాథమిక రంగం వాటా 2014-15లో 19.5 శాతంగా ఉండగా 2020-21 నాటికి 24.1 శాతానికి పెరిగింది.
మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, గొర్రెల పంపిణీ వంటి పథకాల వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది. ప్రాథమిక రంగంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలదే మేజర్ వాటా.
వృద్ధిరేటును పరిశీలిస్తే ప్రాథమికరంగంలో అనూహ్య వృద్ధి నమోదైంది. 2014-15లో 2 శాతం వృద్ధి నమోదుకాగా, 2020-21 నాటికి అది 16.5 శాతంగా ఉన్నది. సుమారు 8 రెట్లు పెరుగటం విశేషం.
ప్రాథమిక రంగంలో ఏడేండ్ల వార్షిక సగటు వృద్ధిరేటు 15.8 శాతంగా నమోదైంది. దక్షిణ భారత్‌లో టాప్‌గా నిలిచింది. ఏపీ (14.6%), కర్ణాటక (10%), తమిళనాడు (9.4%), కేరళ (2.8%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు వృద్ధిరేటు 8.5%కే పరిమితమైంది.
2 ద్వితీయ రంగం (సెకండరీ సెక్టార్)
ఉత్పత్తి, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, వసతులు తదితర విభాగాలు సెకండరీ సెక్టార్ పరిధిలోకి వస్తాయి. గత ఏడేండ్లలో ఈ రంగం రాష్ట్ర జీఎస్డీపీలో 18% వాటా నమోదు చేస్తున్నది. ఉత్పత్తిరంగం 2014-15తో పోల్చితే 2020-21నాటికి 72% వృద్ధి నమోదు చేసింది. తలసరి విద్యుత్ వినియోగంలో అనూహ్య వృద్ధి నమోదైంది.
3 సేవారంగం
వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీస్‌లు, రవాణా, కమ్యూనికేషన్స్, బ్రాడ్‌కాస్టింగ్ సేవలు వంటివి దీని పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర జీఎస్డీపీలో ఈ ఏడాది ఏకంగా 59.5% వాటాను నమోదుచేసింది. 2014-15తో పోల్చితే 2020-21 నాటికి 86 శాతం వృద్ధి కనిపించింది. 2014-15లో సేవారంగం వాటా రూ.2,86,011 కోట్లు కాగా, 2020-21లో రూ.5,33,230 కోట్లకు పెరిగింది. ట్రేడ్, హోటళ్లు, రెస్టారెంట్ల విభాగంలో సైతం రెట్టింపు వృద్ధి నమోదైంది. 2014-15లో రూ.64,269 కోట్లు ఉండగా, 2020-21 నాటికి రూ.1,36,514 కోట్లకు చేరింది.
దేశంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలపాటు కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. 24.87 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా కరెంటు సరఫరా అవుతున్నది. ఈ రాయితీ విలువ ఏటా రూ.10 వేల కోట్లకుపైనే ఉంటుంది. 2014-15లో రాష్ట్రంలో 39,519 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా, ఇప్పుడు ఏకంగా 58,515 మిలియన్ యూనిట్లకు పెరిగింది. తలసరి విద్యుత్ వినియోగంలో ప్రస్తుతం దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నది. సంస్థాగత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2014 జూలైనాటికి 7,778 మెగావాట్లు కాగా, ప్రసుత్తం 109 శాతం వృద్ధిని కనబరుస్తూ 16,249 మెగావాట్లకు పెరిగింది.