హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మనిషికి తగినంత నిద్ర లేకపోతే మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని, గాలి, నీరు, ఆహారం మనిషికి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరమని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) హాస్పిటల్ ఈఎన్టీ వైద్యనిపుణుడు డాక్టర్ శ్రీనివాస్ కిశోర్ చెప్పారు. ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐజీ నిర్వహించిన స్లీప్ డిజార్డర్స్ సర్వే ఫలితాలను శుక్రవారం వెల్లడించారు. నిద్ర మనిషికి జీవసంబంధమైన అవసరమని చెప్పారు. మనిషి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే సరిపోను నిద్ర అవసరమని, నిద్రను నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు. మనిషి జీవన నాణ్యత నిద్రపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. మొదటిది గాఢనిద్రతో మనిషి శరీరం పునర్జీవం పొందుతుందని అన్నారు. రెండోది నిద్రించే వ్యవధి, మూడోది నిద్రిస్తున్న సమయంలో ఎలాంటి అవరోధాలు లేకుండా హాయిగా నిద్రపోవడమని వివరించారు. ఈ మూడు ఉంటేనే దానిని నాణ్యమైన నిద్రగా పరిగణిస్తారని తెలిపారు.
