హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు) పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. కాగా ఈ నెల 8న టీవీవీపీ పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్-స్పెషలిస్టు) పోస్టుల భర్తీలో సర్కార్ జాప్యంపై ‘నమస్తే తెలంగాణ’లో ‘వైద్యులు లేని సర్కార్ దవాఖానలు!’ పేరిట కథనం ప్రచురితమైంది.
దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో పేర్కొన్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జూలై 17 నుంచి 20 వరకు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు బోర్డు వెల్లడించింది. ఏదైనా కారణాలతో నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాలేని అభ్యర్థులకు ఈనెల 21న రిజర్వ్ డేగా నిర్ణయించారు.