తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వయసుతో పోలిస్తే తమిళనాడు ముఖ్యమంత్రి వయసు ఐదేండ్లు చిన్న. రేవంత్ రాజకీయ అనుభవంతో పోలిస్తే విజయ్ రాజకీయ అనుభవం 18 ఏండ్లు తక్కువ. కానీ రాజకీయాల్లో సంస్కారం విషయంలో ఇద్దరినీ పోలిస్తే విజయ్ ఒక పర్వతంగా కనిపిస్తే రేవంత్‌రెడ్డి మాత్రం సంస్కారం విషయంలో ఎవరితోనూ పోల్చలేని స్థితిలో ఉన్నారు. రేవంత్ వయసు 57 ఏండ్లు అయితే విజయ్ వయసు 52 ఏండ్లు. వయసుకు మించిన పరిణతి చూపుతూ విజయ్ తమిళ ప్రజల అభిమానం చూరగొంటున్నారు. రేవంత్‌రెడ్డి 20 ఏండ్ల రాజకీయ ఉత్సవాలను ఇటీవలే జరుపుకొన్నారు. విజయ్ పార్టీ పెట్టి రెండేండ్లు అవుతున్నది. అధికారంలోకి వచ్చి రెండు నెలలే అయింది. కానీ కాకలు తీరిన నాయకులను మించి హుందాతనంతో ముందుకు వెళ్తున్నారు.
సినీనటుడు విజయ్ తమిళనాడులో అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో విజయ్‌ని, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను పోల్చి చూస్తున్నారు. విజయ్ రాజకీయ పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏదో చేయాలనే తపన ఉన్న వ్యక్తి. పార్టీ ఏర్పాటు చేయగానే సినిమాలకు స్వస్తి పలికారు. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి నిర్వర్తిస్తున్నా రు. అయినా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. తా ను అధికారంలోకి రావడానికి కాకుండా, జగన్ మీద కసి, చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే ఆశయంతోనే ఆయన పార్టీ పెట్టినట్టు కనిపిస్తున్నది.
ఇక తమిళనాడు సీఎం విజయ్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారిగా సీఎం పదవి చేపట్టారు. అంతకుముందు మంత్రిగా పని చేసిన అనుభవం ఇద్దరికీ లేదు. ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఆలోచన ఉంటే ఎంతో చేయడానికి అవకాశం ఉన్న పదవులు వారిని వరించాయి. విజయ్‌లో పరిణతి, హుందాతనం కనిపిస్తుంటే రేవంత్‌రెడ్డిలో మాత్రం ముఖ్యమంత్రి హోదా సంగతి పక్కన పెడితే, ఒక సాధారణ మనిషిలో కూడా ఉండకూడని లక్షణాలు ఉన్నాయి… వాటిని ప్రదర్శిస్తున్నారు కూడా. విజయ్ పనితీరును ఉత్తరాది మీడియా కూడా ప్రశంసిస్తున్నది. ఆకస్మిక తనిఖీలు, అధికారులపై ఆగ్రహం అనే రాజకీయ డ్రామాలు ప్రదర్శించడంలేదు. దీంతో హుందాగా వ్యవహరిస్తున్నట్టు పేరు తెచ్చుకొంటున్నారు. ఇక్కడ రేవంత్ గురించి ఓ విషయం చెప్పుకోవాలి. మాజీ సీఎం కేసీఆర్ కాలికి గాయమై దవాఖానలో చికిత్స పొందుతున్నప్పుడు, రేవంత్‌రెడ్డి వెళ్లి పరామర్శించారు. కొన్నాళ్లకు రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ సూచన మేరకు మాత్రమే హాస్పిటల్‌కు వెళ్లానని, లేకపోతే తానెందుకు వెళ్తానని చెప్పారు. ఇలాంటి మాటలు గల్లీ నాయకుడు కూడా మాట్లాడడు.
విజయ్‌లోని సంస్కారం గురించి చూద్దాం. మే 10న విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం చేశారు. కొన్ని రోజులకే మాజీ సీఎం ఎంకే స్టాలిన్ వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయాలు హుందాగానే ఉండేవి. కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, జానారెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గతంలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మంచి సంబంధాలు ఉండేవని, తిరిగి ఆ సంప్రదాయం కోసం ప్రయత్నిద్దామని అసెంబ్లీలో కేసీఆర్ సూచించారు.
కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి రక్త పిపాసిలా, రక్తం భాష మాట్లాడే స్థాయికి దిగజారారు. కరువు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలేంటని ఓ విలేకరి అడిగితే, కేటీఆర్, హరీశ్‌రావును కోసి, వారి రక్తం పొలాల్లో చల్లితే పంటలు పండుతాయంటూ సీఎం జుగుప్సాకరమైన, రాక్షస భాషను మాట్లాడారు. మరోవైపు, ఈ నెల 8న విజయ్ ఎగ్మోర్ ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. డాక్టర్లు, రోగులతో మాట్లాడారు. ఇదేం పెద్ద విశేషం కాదనే అనిపిస్తుంది. కానీ విజయ్ హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్ కుర్చీలో కూర్చోలేదు. డాక్టర్లను నిలబెట్టి మాట్లాడలేదు. డాక్టర్ కుర్చీలో డాక్టర్ కూర్చొని ఉంటే ఎదురుగా పేషంట్లు కూర్చునే కుర్చీలో విజయ్ కూర్చున్నారు. మీడియా కెమెరాల కోసం కాకుండా సంస్కారవంతమైన జీవనం గడిపేవారు చేసే పని ఇది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మెదక్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకున్నది. కేసీఆర్ స్వయంగా కలెక్టర్‌ను కుర్చీలో కూర్చోబెట్టి, తాను ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నారు. సాధారణంగా చిన్న స్థాయి అధికారి కూడా తన కింది అధికారి వద్దకు వెళ్లినప్పుడు అతని చైర్లో కూర్చొని తన దర్పం చూపిస్తుంటారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఓ హాస్పిటల్‌ను సందర్శించినప్పుడు డాక్టర్లను నిలబెట్టి, తాను కుర్చీలో సాగిలబడి కూర్చున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజలు అన్నీ పరిశీలిస్తుంటారు.. నేతల ప్రవర్తనలను పోల్చుకుంటారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో రైతులను కాపాడేందుకు నీటిని ఎత్తిపోయాలి అని రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ప్రభుత్వానికి సూచిస్తే వాళ్లకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని, జైలులో వేయాల్సిందని రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు చూశాం. మహిళకు ఉచిత బస్సు వల్ల మెట్రో ఆదాయం తగ్గుతున్నదని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ప్రకటిస్తే, వారిని జైలులో వేయాలంటూ జాతీయ మీడియా ముందు వీరంగం చేశారు. ఎల్ అండ్ టీ సంస్థ చేపట్టే పనులు మన రాష్ట్ర బడ్జెట్‌ను మించి ఉంటాయి. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆ సంస్థ పనులు చేస్తున్నది. రాష్ట్రం దాటితే రేవంత్‌రెడ్డిని పట్టించుకొనేవాళ్లు ఉండరు. అఫ్కోర్స్.. రాష్ట్రంలో కూడా పట్టించుకొనే వాళ్లు లేరు.. అది వేరే సంగతి.
ఎవరేం మాట్లాడినా ‘జైలులో వేస్తా, లాగుల్లో తొండలు వదులుతా’ అనడం ఇదేం భాషనో! ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు బెయిల్‌పై మాత్రమే బయట జీవనం సాగిస్తున్న సంగతి మర్చిపోకూడదు. ఇక తనకు నచ్చని అభిప్రాయం చెప్పిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయిస్తా, జైలుకు పంపిస్తా అని బెదిరించడం విడ్డూరం. తన వాహనం వెళ్లేప్పుడు ట్రాఫిక్ నిలిపివేయవద్దు అని తమిళనాడు సీఎం విజయ్ ఆదేశించారు.. అమలు చేస్తున్నారు. కానీ రేవంత్ట్రాఫిక్ ఆపవద్దు అని మొదటి రోజు ఆదేశించి, మీడియాలో ప్రచారం చేయించుకొన్నారు. ఇప్పుడు సీఎం వెళ్తుంటే ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేస్తున్నారు. రేవంత్‌రెడ్డికే కాదు చివరకు ఆయన అన్నదమ్ములకు కూడా అధికారులు ప్రొటోకాల్ అమలు చేస్తున్నారు. జిల్లాల కలెక్టర్లు కూడా వారికి స్వాగతం పలుకుతున్నారు.
తెలంగాణ కన్నా తమిళనాడు పెద్ద రాష్ట్రం. 2036 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తన లక్ష్యం అని విజయ్ ప్రకటిస్తే, పది ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తన లక్ష్యం అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పది ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించడం తర్వాత సంగతి.. కనీసం పది ట్రిలియన్ డాలర్ల అంకె తప్పు లేకుండా రాస్తే విజయం సాధించినట్టే. తమిళనాడులో విజయ్‌ని ఆహా ఓహో అంటూ కీర్తించే సొంత మీడియా, అనుకూల మీడియా లేదు. కానీ తన సంస్కారం ద్వారా, ప్రజలకు నిజంగా మేలు చేయాలి అనే లక్ష్యం ద్వారా ప్రజల అభిమానాన్ని ఆయన కూడగట్టుకొంటున్నారు.
తెలంగాణలో రాజకీయాలను వ్యాపారంగా భావిస్తూ రేవంత్‌రెడ్డి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. అలాంటి నాయకుడిలో సంస్కారం వెతకడమా… హహహ! విడ్డూరం కాకపోతే మరేం టి? సంస్కారహీన స్థితిలో రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని జగమెరిగిన నిజం… జనాలకు తెలిసిన సత్యం.. తానేంటో స్వయంగా తానే నిరూపించుకొంటున్న వాస్తవం.
-బుద్దా మురళి