హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): హోంగార్డుల్లో పని ఒత్తిడి తీవ్రమైంది. పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుళ్లు, ఉన్నతాధికారులు చెప్పే బయటి పనులు చేయలేక కొందరు అవస్థలు పడుతున్నారు. అధికారులు సొంత పనుల మీద బయటకు పంపినప్పుడు దారి ఖర్చులు జేబులో నుంచి పెట్టుకోవాల్సి రావడం మరో తలనొప్పిగా మారింది. రెండు నెలల క్రితం వరకు చాలామందికి సరైన సమయానికి వేతనాలు రాకపోవడంతో ఇంటి ఖర్చులు వెళ్లదీసుకోలేక ఇబ్బందులు పడ్డారు. భౌతికంగా వెట్టిచారికి.. మానసికంగా ఉన్నతాధికారులు పెట్టే ఒత్తిళ్లు తట్టుకోలేక హోంగార్డులు కుంగిపోతున్నారు. అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం పెద్ద దవాఖానల్లో మెరుగైన చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక, పరిస్థితి విషమించి కన్నుమూస్తున్నారు.
ఇటీవల 3 రోజుల్లోనే ముగ్గురు హోంగార్డులు వివిధ కారణాలతో మరణించారు. సంతోష్‌నగర్ ఏసీపీ ఆఫీస్‌లో హోంగార్డుగా పని చేసిన విజయ్‌కుమార్ (హెచ్‌జీ: 8000) గుండెపోటుతో చనిపోయాడు. గురువారం రాత్రి గోషామహల్ ట్రాఫిక్ పీఎస్‌లో విధుల్లో ఉన్న మీర్జా మునీర్బేగ్ (హెచ్‌జీ: 6953) అకాల మరణం చెందాడు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన రామాంజనేయులు (హెచ్‌జీ: 4977) కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ చనిపోయాడు. వరుస మరణాలపై సహచర హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
హోంగార్డులకు హెల్త్‌కార్డు మంజూరు చేస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీ.. అటకెక్కిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులకు కల్పించే ‘ఆరోగ్య భద్రత’ హోంగార్డులకు వర్తించదు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఉండదు. హోంగార్డులను పర్మినెంట్ చేస్తామన్న కాంగ్రెస్ హామీ కూడా ఆచరణకు నోచుకోవడంలేదు. మరణించిన 800 మంది హోంగార్డుల కుటుంబాల్లో ఒక్కొక్కరి చొప్పున కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పిస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ అధికారం చేపట్టగానే పట్టించుకోవడడంలేదని హోం గార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొత్తగా వచ్చిన డీజీపీ శివధర్రెడ్డిపై తాము నమ్మకం పెట్టుకున్నట్టు పలువురు హోంగార్డులు చెప్తున్నారు. ఒక్కసారి తమ గోడు వినాలని, ప్రభుత్వానికి విన్నవించాలని కోరుతున్నారు. హోంగార్డు నేతలతో చర్చించి సమస్యల పరిష్కారం కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని వేడుకుంటున్నారు.