Prajapalana | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రు లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారుల బృందాలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు వెళ్లి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. మొదటిరోజు 7,46, 414 దరఖాస్తులు స్వీకరించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు వచ్చాయని, పట్టణ ప్రాంతాల్లో 4,57,703 మంది దరఖాస్తు చేసుకొన్నారని వెల్లడించారు. ప్రజాపాలనపై ఆమె గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దరఖాస్తు ఫారాలను ప్రజలకు అధికారులు ఉచితంగా ఇవ్వాలని, వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అయితే, ఈ కార్యక్రమంలో తొలిరోజే అనేక చోట్ల గందరగోళం నెలకొన్నది. చాలాచోట్ల దరఖాస్తు ఫారాల కొరత ఏర్పడింది. ఇదే అదనుగా జిరాక్స్ సెంటర్ల యజమానులు ఒక్కో దరఖాస్తు ఫారం జిరాక్స్ తీసేంకు రూ.30 నుంచి రూ.100 వరకు కూడా వసూలు చేశారు. దరఖాస్తు ఫారంలోని అంశాలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను అధికారులు తీర్చలేకపోవటంతో పలుచోట్ల వాగ్వాదాలు చోటుచేసుకొన్నాయి. కొన్నిచోట్ల కాంగ్రెస్ నేతలే అంతా తామే అయ్యి కార్యక్రమం నిర్వహించటంతో ప్రొటోకాల్ సమస్యలు తలెత్తాయి.
దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం 4 గంటలే సమయం ఇవ్వటంతో మొదటిరోజు చాలాచోట్ల తొక్కిసలాట పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు ఒకచోట, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరోచోట దరఖాస్తులు స్వీకరిస్తారని ప్రభుత్వం మొదట ప్రకటిచింది. అయితే, తొలిరోజు అనేక చోట్ల ఉదయం ఒకటి రెండు గంటల ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటికే దరఖాస్తు స్వీకరణ కేంద్రాలకు భారీగా చేరుకొన్న ప్రజలు దరఖాస్తు ఫారాల కోసం ఎగబడ్డారు. సమయం మించిపోతే దరఖాస్తులు తీసుకోరేమోనన్న భయంతో పరస్పరం తోసుకొంటూ ఫారాలను త్వరగా తీసుకొని, వివరాలు రాసి ఇచ్చేందుకు పోటీలు పడ్డారు. ఇదే సమయంలో కొన్నిచోట్ల ఫారాలు సరిపోకపోవటంతో అవి అందనివారు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలని అధికారులు సూచించటంతో చాలామంది అటువైపు పరుగులు పెట్టారు. నిజానికి బుధవారమే గ్రామాల్లో ఇంటింటికీ ఫారాలు పంచాలని ప్రభుత్వం మొదట ఆదేశించింది. కానీ, గురువారం అధికారులు దరఖాస్తు ఫారాలను తమ వెంట తెచ్చుకొని ఉదయం 8 గంటల తర్వాతే పంచటంతో చాలాచోట్ల వాటికోసం తోపులాట జరిగింది. మీ సేవా కేంద్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా కనిపించింది.
ప్రజా పాలన కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలిరోజే 1.98 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. 150 డివిజన్లలో మొత్తం 600 కేంద్రాలను బల్దియా అధికారులు ఏర్పాటు చేశారు. రెండు సెషన్లలో అభయహస్తం దరఖాస్తులను స్వీకరించగా, తొలిరోజున జనాలకు సరిపోయేలా దరఖాస్తులు లభించక ఆందోళన చెందారు. దీంతో ప్రజాపాలన కౌంటర్ల కంటే మీ సేవా, జిరాక్స్ సెంటర్ల వద్దనే జనాలు కిక్కిరిపోయారు. ఇదే అదనుగా జిరాక్స్, మీ సేవా నిర్వహకులు ఒక్కో దరఖాస్తు ఫారానికి రూ.50-100 చొప్పున వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 141 పట్టన స్థానిక సంస్థ (యూఎల్బీ)ల నుంచి తొలిరోజు 81,964 దరఖాస్తులు అందినట్టు అధికారులు వెల్లడించారు. మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ హరిచందన దాసరి, అదనపు డైరెక్టర్ డీ జాన్ శామ్సన్ పీర్జాదిగూడ, బోడుప్పల్, పోచారం తదితర మున్సిపాలిటీల పరిధిలో పలు ప్రజాపాలన కేంద్రాలను తనిఖీచేసి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబరు- 040-23120410కు ఫోన్ చేయాలని సూచించారు. దరఖాస్తు ఫారం emunicipal.telangana. gov.in వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నదని వివరించారు.
నా పేరు బొమ్మకంటి జ్యోతి. మాది రాయికల్ పట్టణం. పిల్లల చదువుల కోసం ఆరేండ్ల క్రితం జగిత్యాల పట్టణానికి వచ్చి కిరాయి ఇంట్లో ఉంటున్నాం. మా అబ్బాయి ఇంటర్, కూతురు పాలిటెక్నిక్ చదవుతున్నారు. మాకు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అన్నీ రాయికల్‌లోనే ఉన్నాయి. కానీ అక్కడ కూడా సొంత ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసేందుకు రాయికల్ వచ్చాను. అయితే గృహజ్యోతి (200 యూనిట్ల లోపు విభాగానికి సంబంధించి) పథకానికి దరఖాస్తు చేయలేదు. నేను ఉండేది కిరాయి ఇంట్లో కాబట్టి గృహజ్యోతికోసం దరఖాస్తు చేయలేకపోయాను. నా కూతురుకు 18 ఏండ్లు నిండాయి. ఆమెకు సైతం మహాలక్ష్మి పథకానికి అర్హత ఉన్నది. ఆమెకు కూడా పథకాన్ని వర్తింపజేయాలి.