Kollapur | కొల్లాపూర్ రూరల్/ఉండవెల్లి, మే 8: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ మంత్రికి, కాంగ్రెస్ నేతలకు ఊహించని విధంగా నిరసన సెగ తగిలింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని 11వ వార్డులో బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి జూపల్లిని స్థానిక మహిళలు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీశారు.
గ్యారెంటీలను ఎందుకు అమలు చేయలేదంటూ వారు మంత్రిని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో కొంత సేపు ఏం జరుగుతున్నదో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది. దీంతో మహిళలపై మంత్రి జూపల్లి అసహనం వ్యక్తం చేస్తూ.. ‘గాయ్ గాయ్ చేస్తే పనులు జరుగవు’ అంటూ ‘మీకు ఇండ్లు రావు’ అని బెదిరించేందుకు ప్రయత్నించారు. మహిళలు సైతం దీటుగానే సమాధానమిచ్చారు.
ఓట్ల కోసం వచ్చి మాయమాటలతో తమను మోసం చేశారని, హామీలు ఎక్కడ అని అడిగితే ఇప్పుడు బెదిరింపులకు దిగుతావా? అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన రోజు నుంచి కాలనీలో కనీసం డ్రైనేజీలను కూడా శుభ్రం చేయడం లేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం వచ్చారని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు. ఏం చేయాలో తోచని మంత్రి మహిళలకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు.
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో సైతం ఇదేవిధంగా కాంగ్రెస్, సీపీఎం నేతలకు చుక్కెదురైంది. ఆరు గ్యారెంటీలను ఎక్కడ అమలు చేస్తున్నారంటూ ఉపాధి హామీ కూలీలు వారిని నిలదీశారు. ఉండవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేత వెంకట్‌గౌడ్, సీపీఎం నేత మద్దిలేటి తదితరులు ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు ప్రచారానికి వెళ్లారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆరు గ్యారెంటీలతోపాటు ఉపాధి కూలి రూ.400 చెల్లిస్తామని చెప్పడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైనా సరిగ్గా అమలవుతున్నదా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల నిలబడేందుకు కూడా స్థలం ఉండటం లేదని మండిపడ్డారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇప్పటివరకు అమలు కావడం లేదని, తాము బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఎక్కడికి పోయాయని నిలదీశారు. తనకు 60 ఏండ్లు దాటినా సంక్షేమ పథకాలకు అర్హురాలిని కావడం లేదంటూ ఓ వృద్ధురాలు వాపోయారు. దీంతో కాంగ్రెస్, సీపీఎం నాయకులు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెనుదిరిగారు.