MLA KR Nagaraju | వర్ధన్నపేట, ఏప్రిల్ 1: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంగళవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇసుక కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆకేరువాగు నుంచి ఇసుక రవాణా చేయకుండా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవడంతో తాము పూర్తిగా ఉపాధి కోల్పోయామని ఆందోళన వ్యక్తంచేశారు.
పూర్తిగా వాగు ఇసుక మీదనే ఆధారపడి దశాబ్దాలుగా జీవిస్తున్నామని, ఇప్పుడు అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి పంపించేందుకు ప్రయత్నించారు. కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము ఓట్లు వేసి గెలిపిస్తే తమకే ఉపాధి లేకుండా చేసిన ఎమ్మెల్యేకు తగిన గుణపాఠం చెబుతామని ఈ సం దర్భంగా కూలీలు హెచ్చరించారు.