Congress Govt | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): కార్మిక సంక్షేమ నిధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారిలో వినియోగిస్తున్నదా? కార్మికుల సంక్షేమం కోసమే వాడాల్సిన డబ్బును దారిమళ్లించి భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహణ కోసం ఖర్చు పెడుతున్నదా? వివాస కానుక పథకం కోసం కార్మికులు పెట్టుకున్న 600 అర్జీలను పక్కనపెట్టి మరీ సంక్షేమ నిధి నిధులను పక్కకు మళ్లించారా? ఒక్క రూపాయి కూడా పారిశ్రామిక పెట్టుబడులకు అవకాశమే లేని భారత్ సమ్మిట్ సదస్సుకు పారిశ్రామిక పెట్టుబడులను ముడిపెట్టి కార్మిక సంక్షేమ శాఖ నుంచి నిధులు మళ్లించడం నిజమేనా? అంటే కార్మిక శాఖ అధికారుల నుంచి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది. కార్మిక సంక్షేమ నిధి నుంచి గత నెలలో రూ.300 కోట్లు డ్రా చేసినట్టు కార్మిక శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. ఇందులోంచి రూ.250 కోట్లను ఫ్యూచర్‌సిటీ అథారిటీ పరిధిలో ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అండ్ ఎడ్యుకేషన్ హబ్‌కు వినియోగించినట్టు తెలిసింది. మిగిలిన సొమ్ములో నుంచి రూ.30 కోట్లు భారత్ సమ్మిట్ సదస్సుకు ఖర్చు చేస్తున్నట్టు కార్మిక శాఖ అధికారుల్లో చర్చ జరుగుతున్నది. ఇందుకోసం కార్మిక శాఖలో కాలంచెల్లిన జీవో ఒకదాన్ని వెలికితీసి, దానికి మళ్లీ జీవం పోసి నిధులు డ్రా చేసినట్టు ఆ శాఖలో చర్చించుకుంటున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిగితే అసలు విషయం బయటికి వస్తుందని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
భారత్ సమ్మిట్ నిర్వహణకు అవసరమయ్యే నిధులను ఎక్కడినుంచి సమకూర్చుతున్నారనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మొదటినుంచీ గోప్యత పాటిస్తున్నది. మొదట టూరిజం శాఖ నుంచి నిధులు ఖర్చు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. తరువాత సోషల్‌జస్టిస్ నిధులు ఖర్చు చేయబోతున్నట్టు, ఎస్డీఎఫ్ నిధులు ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం కార్మిక శాఖ నిధి నుంచి నిధులు ఖర్చు చేశారనే ప్రచారం జరుగుతున్నది. కానీ, ఇప్పటివరకు ఏ శాఖ నుంచి నిధులు ఖర్చు చేస్తున్నారనేది ప్రభుత్వం బయటికి చెప్పలేదు. నిబంధనల ప్రకారం ఇటువంటి ఈవెంట్ నిర్వాహణ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలి. కానీ, గ్లోబల్ టెండర్లు పిలువకుండానే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థకు పనులు అప్పగించినట్టు తెలిసింది.
తెలంగాణను గ్లోబల్ డైలాగ్, ఆవిషరణల కేంద్రంగా నిలపడం కోసం భారత్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం చెప్తున్నది. తెలంగాణ రైజింగ్ విజన్‌ను ప్రదర్శించి, గ్లోబల్ పెట్టుబడులను ప్రోత్సహిస్తామని ప్రకటించింది. కానీ, సమ్మిట్ ప్రతినిధుల గ్రూప్ చర్చలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతినిధుల ప్రాతినిధ్యమే లేకపోవడం గమనార్హం. ప్రతినిధుల ప్రాతినిధ్యం లేకుండా కేవలం పార్టీ నేతలతో రాజకీయ ప్రసంగాలు ఇప్పించినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయా? అని పారిశ్రామిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడులు, న్యాయం, ప్రపంచశాంతి, అహింస తదితర లక్ష్యాలతో భారత్ సమ్మిట్-2025 శుక్రవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) నోవాటెల్‌లో రెండు రోజులపాటు ఈ సమ్మిట్ జరుగనున్నది. ఈ అంతర్జాతీయ సదస్సుకు 100కుపైగా దేశాల నుంచి 450 మందికిపైగా ప్రతినిధులు హాజరైనట్టు నిర్వాహకులు చెప్తున్నారు.
అలీనోద్యమ ప్రతిపాదనకు 70 ఏండ్లు పూర్తి అయిన సందర్భంగా అంతర్జాతీయ సదస్సు ఒకటి నిర్వహించాలని ఏఐసీసీ ప్రతిపాదించింది. కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో బెంగళూరు, హైదరాబాద్‌లో ఏదో ఒకచోట పార్టీ పరంగా నిర్వహించాలని ఆలోచన చేసినట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో సదస్సుకు తగిన ఆర్థిక వనరులను సమకూర్చలేమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేతులు ఎత్తేసినట్టు సమాచారం. దీంతో తాము ప్రభుత్వపరంగా తెలంగాణలో నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి నెత్తికి ఎత్తుకున్నట్టు ఆ పార్టీ ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న సమావేశం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సమ్మిట్‌గా మారిపోయిందనే విమర్శలొస్తున్నాయి. ఎన్ఎస్యూఐ నేతలకు నిర్వాహణ బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో వారు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ తరహాలోనే సదస్సు నిర్వహించారనే ఆరోపణలున్నాయి.
వంద దేశాల నుంచి ప్రతినిధులు హాజరైనట్టు రాష్ట్ర ప్రభుత్వం తొలిరోజు ప్రకటించింది. అయితే, ఆ వంద దేశాలు ఏవి? ప్రతినిధులు ఎవరు? అనే అంశం మీద నిర్వాహకులకు కూడా స్పష్టత లేదు. ఇది విదేశాంగ విధానపరమైన కార్యక్రమం కాబట్టి సదస్సుకు సహకారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో విదేశాంగ మంత్రిని కలిసి కోరిన విషయం తెలిసిందే. అయితే, దీనిని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా భావిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అర్థిక సహకారం అందించలేదు. తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
రాష్ట్రంలోని ప్రతి భవన, ఇతర నిర్మాణాల అనుమతుల మీద 1% సెస్ వసూలు చేస్తున్నారు. ఈ డబ్బు కార్మిక శాఖ పరిధిలో నడిచే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఖాతాలో జమ అవుతుంది. దీనినే కార్మిక సంక్షేమ నిధి పేరుతో పిలుస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.2,500 కోట్ల సంక్షేమ నిధిని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించింది. ఈ డబ్బును కేవలం కార్మిక సంక్షేమానికి మాత్రమే వినియోగించాలి. కార్మిక నిధికి అనుసంధానంగా వివాహ కానుక, ప్రసూతి సహాయం, కార్మికుని సహజ మరణం లేదా ప్రమాదం మరణం సమయాల్లో దహన ఖర్చులు, అంగవైకల్యం పొందితే ఆర్థిక సహాయం, వృత్తిపరమైన శిక్షణ తదితర సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. ఈ పథకాలకు మాత్రమే సంక్షేమ నిధి డబ్బులు ఖర్చు చేయాలి. ఇక్కడ వృతి నైపుణ్య శిక్షణ అనే సాంకేతిక పాయింట్‌ను ఆధారంగా చేసుకొని నిధులను అడ్డదారిలో మళ్లించారని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు.