రామవరం, ఏప్రిల్ 14 : తెలంగాణోద్యమంలో కీలక భూమిక పోషించిన కార్మికోద్యమ నేత రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏరియా ధన్‌బాద్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్, కాంట్రాక్టు కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు రాసూరి శంకర్(58) కొత్తగూడెంలో పనులు ముగించుకొని గౌతంపూర్‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో ధన్‌బాద్ పోచమ్మ గుడి నుంచి గౌతంపూర్ వెళ్లేందుకు ఇండికేటర్వేసి రోడ్డు దాటుతున్నాడు.
కొత్తగూడెం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తులు బైక్‌పై వేగంగా వచ్చి శంకర్ బైక్‌ను ఢీకొట్టారు. దీంతో కిందపడిన శంకర్ తలకు తీవ్రగాయంకావడంతో స్థానికులు 108 వాహనంలో సింగరేణి ప్రధాన దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు సూచనమేరకు హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. శంకర్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల జరిగిన బోర్డు మెడికల్ టెస్ట్‌లో అతడు అన్‌ఫిట్ కావడంతో కూతురుకు ఉద్యోగం ఇప్పించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. శంకర్ మృతిపట్ల బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ సంతాపం తెలిపారు.
టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్‌గా, కాంట్రాక్టు కార్మికుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడిగా.. కాంట్రాక్టు కార్మికుల హక్కుల కోసం శంకర్ నిరంతరం శ్రమించారు. 2007లో కొత్తగూడెం ఏరియా ప్రాంతంలో టీబీజీకేఎస్ రెండో స్థానం సాధించడానికి ప్రధాన భూమిక పోషించారు. తెలంగాణ ఉద్యమంలో రుద్రంపూర్ జేఏసీతో కలిసి పాలుపంచుకున్నారు. 2012లో బీఆర్ఎస్ అనుబంధ గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్ గెలుపొందడంలో కీలకపాత్ర పోషించారు.
తెలంగాణ ఏర్పాటుతో కార్మికులకు కలిగే ఉపయోగాలను వివరిస్తూ మైన్లు, డిపార్ట్మెంట్ల వద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. టీబీజీకేఎస్ జెండా పట్టుకోవడానికి భయపడుతున్న రోజుల్లో కార్మికులకు అండగా ఉండి 2012 లో గుర్తింపు సంఘంగా గెలవడంలో ఆయన పాత్ర మర్చిపోలేనిది. ఆయన మరణవార్త విని తెలంగాణవాదులు, కాంట్రాక్టు కార్మికులు, వివిధ పార్టీలు, కులసంఘాల నాయకులు సంతాపం వ్యక్తంచేశారు.