హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఇటీవల నోటిఫై చేసిన నాలుగు లేబర్ కోడ్స్‌ను కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యానగర్‌లోని కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కార్మిక శాఖ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. లేబర్ కోడ్స్‌ను రద్దు చేసే వరకూ పోరాటం ఆపబోమని స్పష్టంచేశారు.
నూతన లేబర్ కోడ్లు కార్మిక హక్కులకు మరణశాసమని ఆందోళన వ్యక్తంచేశారు. ధర్నాలో ఫెడరేషన్ అడ్హాక్ కమిటీ కన్వీనర్ రాంచందర్, టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, నేతలు ప్రభాకర్, గుడిగ రఘు, రాజశేఖర్, దామోదర్, మాణిక్‌ప్రభు, చంద్రశేఖర్, నవీన్, మణిమాల, హరిప్రసాద్, మేకల కృష్ణ, మధూకర్, హెచ్‌యూజే అధ్యక్షుడు అరుణ్‌కుమార్, జగదీశ్వర్, లలిత, రమాదేవి, రత్నాకర్, శ్రీనివాసరావు, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.