హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఉపకార వేతనాలు చెల్లించకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రజినీకాంత్ ఆరోపించారు.
సోమవారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు డీ కిరణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం హౌస్సర్జన్లు, పీజీ విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యాలు ఇవ్వకుండా ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు.
కొన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఉత్తర్వులు, ఎన్ఎంసీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. ఈ సమావేశంలో పలు విద్యార్థి సంఘ నాయకులు పీ మహేశ్, పొడపంగి నాగరాజు, ఎస్. నాగేశ్వరరావు, గణేశ్, పవన్, టీ సాగర్, ఆర్ శ్రీరామ్‌నాయక్, జే వెంకటేశ్, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.