హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో రెకాడితేగానీ డొకాడని పేదలకు ఆసరాగా నిలిచే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టేస్తున్నది. రాష్ర్టానికి ఏటికేడు లేబర్ బడ్జెట్ను భారీగా తగ్గిస్తూ క్షేత్రస్థాయిలో ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. పనిదినాలను గణనీయంగా తగ్గించడమే కాకుండా నిధుల విడుదల్లో జాప్యం చేస్తూ పేదల పొట్ట కొడుతున్నది. నాలుగేండ్ల కాలంలోనే గ్రామీణ కూలీల పనిదినాలను సగానికి సగం తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు 11 కోట్ల పనిదినాలను మంజూరు చేసిన కేంద్రం.. 2025-26లో వాటిని 7 కోట్లకే పరిమితం చేసింది. అంటే సుమారు 4 కోట్ల పనిదినాలను కుదించి, 36% పనులకు కోత పెట్టింది. ఫలితంగా గ్రామాల్లో వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి, వలసల బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఇంతవరకు బడ్జెట్ను ఖరారు చేయలేదు. దీంతో అసలు ఈ ఏడాది ఎన్ని పనిదినాలు కల్పిస్తారు? ఎన్ని నిధులు కేటాయిస్తారు? అనే అంశంపై తీవ్ర అనిశ్చితి నెలకొన్నది.
కేటాయింపులు భారీగా తగ్గింపు
గతంలో మాదిరిగా ఉపాధి హామీకి కేంద్రం నేరుగా బడ్జెట్ కేటాయించకుండా ఆ పథకాన్ని క్రమంగా కొత్త పథకంలో విలీనం చేయడమే లక్ష్యంగా కీలక సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో ‘వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. తద్వారా పాత ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులను భారీగా తగ్గించి కొత్త పథకానికి మళ్లించింది. ప్రస్తుతం పథకంలో కేంద్రం 60%, రాష్ట్ర ప్ర భుత్వాలు 40% నిధులను భరించాల్సి ఉం టుంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం పాత పద్ధతిలో పని అడిగితే హక్కుగా కల్పించాలనే నియమం ఉండేది. కానీ, ఇప్పు డు కేంద్రం పరిమితి విధించింది. ఆ పరిమితి దాటి పని కావాలంటే రాష్ట్రాలే సొంతంగా ఖర్చు పెట్టుకోవాలి. అందుకే కేంద్రం తన బడ్జెట్ పద్దుల్లో భారీ కేటాయింపులు చూపడం లేదు.
వేధిస్తున్న సాంకేతిక సమస్యలు..
నిధుల విడుదల్లో జాప్యం నిధుల కోతతో ఆగకుండా కేంద్రం పెడుతున్న కొత్త నిబంధనలు కూలీలకు శాపంగా మారుతున్నాయి. ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్’ ద్వారా అటెండెన్స్ వేయడం, ఆధార్ ఆధారిత చెల్లింపుల్లో సాంకేతిక సమస్యల వల్ల వేలమంది కూలీలు తాము చేసిన పనికి వే తనాలు పొందలేకపోతున్నారు. మరోవైపు మెటీరియల్ నిధుల విడుదల్లో జాప్యం వల్ల గ్రామాల్లో సివిల్ పనులు నిలిచిపోయాయి. తెలంగాణలో వ్యవసాయంపై ఆధారపడి జీవించే కూలీలకు వేసవిలో ఉపాధి హామీ పథకమే ఏకైక దికు. కానీ కేంద్ర ప్రభుత్వం లేబర్ బడ్జెట్లో పనిదినాలను 7 కోట్లకు తగ్గించడంతో డిమాండ్ ఉన్నప్పటికీ కూలీలకు పని కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒకప్పుడు ఉపాధి హామీ పథకం ద్వారా వలసలను అరికట్టిన గ్రామాల్లో ఇప్పుడు పేదలు పొట్ట చేతపట్టుకుని మళ్లీ నగరాలకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
గత నాలుగేండ్లలో తెలంగాణకు మంజూరైన పనిదినాలు
సంవత్సరం సంఖ్య (కోట్లలో)