కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుదలపై ప్రభావం పడింది. దీనిద్వారా మాకు అప్పుల భారం కూడా పెరుగుతున్నది.
-కొంతకాలం కిందట ఓ ఇంటర్వ్యూలో హైదరాబాద్ మెట్రోను ప్రస్తావిస్తూ ఎల్అండ్టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) శంకర్రామన్ చేసిన వ్యాఖ్యలివి
ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఎల్అండ్టీ అధికారిని జైలులో పడేస్తా
-సీఎఫ్‌వో మాటలపై ఢిల్లీలో మీడియా ఎదుట సీఎం రేవంత్‌రెడ్ది హెచ్చరిక ఇది
రాష్ట్రం నుంచి మరో ప్రపంచ దిగ్గజ కంపెనీ తప్పుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో పలు కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో ఎల్అండ్టీ చేరింది. ప్రపంచంలోనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానం, విశేష అనుభవం ఉన్న ఈ దిగ్గజ కంపెనీ ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తప్పుకునేందుకు ముహూర్తం ఖరారైంది. తెగదెంపుల ప్రక్రియను ఎలా చేపట్టాలనే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వంతో మాటామంతీ ముగిసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు లిమిటెడ్ (HMRL) నుంచి తప్పుకుంటూ ఎల్అండ్టీ (L&T) సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో తన నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రధానంగా మెట్రో (Hyderabad Metro) మొదటి దశ నుంచి తప్పుకునేందుకు రూ.13 వేల కోట్ల అప్పుల్ని తీసుకోవడంతోపాటు తమకు రూ.5,900 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం ముందు డిమాండ్ ఉంచిన ఎల్అండ్టీ.. సంప్రదింపుల్లో భాగంగా కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే తీసుకొని తప్పుకునేందుకు అంగీకరించడం పారిశ్రామికవర్గాలనే విస్మయానికి గురిచేస్తున్నది. సాధారణంగా ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వం నుంచి అనుకున్న దానికంటే రూపాయి ఎక్కువ రాబట్టేందుకే ప్రయత్నించడమనేది వ్యాపార సూత్రం. కానీ డిమాండ్ చేసిన దానిలో కేవలం మూడోవంతుతోనే సరిపెట్టుకుని మెట్రో నుంచి తప్పుకొని సుమారు రెండు దశాబ్దాల బంధాన్ని తెంపుకొనేందుకు ఆ కంపెనీ సిద్ధమైందంటే తెరవెనక బలమైన కారణాలే ఉన్నాయని పారిశ్రామికవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇందుకు రేవంత్ సర్కారు దుందుడుకు చర్యలే ప్రధాన కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చివరకు కరోనా కష్టకాలంలోనూ నెట్టుకొచ్చిన ఎల్అండ్టీ.. ఇక తాము ఇక్కడ వేగలేమని తెగదెంపులు చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చోటుచేసుకున్న కీలక పరిణామాలే కారణమని చెప్తున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రో ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోకు ఖ్యాతి ఉన్నది. కానీ ఇప్పుడా ఖ్యాతి ఒక్కసారిగా మసకబారింది. 2017లో మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చిన ఎల్అండ్టీ ఆపై తాము ఆశించిన స్థాయిలో వాణిజ్య ప్రణాళికలు (భూముల్ని లీజుకివ్వడం, వ్యాపారపరంగా అభివృద్ధి చేయడం) కలిసిరాలేదని ఆది నుంచి చెప్తూవస్తున్నది. కేసీఆర్ హయాంలో ఆ మేరకు ఎల్అండ్టీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసి వారి సాధక బాధకాల్లో సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం సహకరిస్తూ వచ్చింది. అందుకే ఎల్అండ్టీ కరోనా వంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ మెట్రో ప్రాజెక్టును ముందుకు నెట్టుకొచ్చింది. కానీ నానాటికీ ప్రయాణికుల సంఖ్య పెరిగి ఏకంగా రోజుకు ఐదు లక్షలకు చేరుకోవడంతోపాటు విస్తరణ ప్రాజెక్టులు వస్తున్న ఈ తరుణంలో ప్రాజెక్టు నుంచి పూర్తిగా తప్పుకోవాలనే నిర్ణయం తీసుకోవడమనేది ఆశామాషీ వ్యవహారం కాదని పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఆ కంపెనీకి ఆశావహ పరిస్థితులు కనిపించకపోగా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒకవిధంగా కక్షతో వెంటాడే తీరుగా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోయిందని పారిశ్రామికవర్గాల్లో చాలాకాలంగా చర్చ జరుగుతున్నది.
ఏదైనా అంతర్జాతీయ కంపెనీ తరచూ తమ ప్రాజెక్టులకు సంబంధించిన సాధక బాధకాల్ని వ్యూహాత్మకంగా బయటికి వెల్లడిస్తారు. తద్వారా ప్రభుత్వాల నుంచి తమకు సానుకూలంగా ఏదైనా పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావం వారిది. అందులో భాగంగానే ఎల్అండ్టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) శంకర్రామన్ కొంతకాలం కిందట ఒక ఇంటర్వ్యూలో హైదరాబాద్ మెట్రోను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుదలపై ప్రభావం పడిందని వ్యాఖ్యానించారు. తద్వారా తమకు అప్పుల భారం కూడా పెరుగుతుందన్నారు. దీనిని ఢిల్లీలో ఒక సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్ది ముందు మీడియా ప్రస్తావిస్తే ‘ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఎల్అండ్టీ సీఈవోను జైలులో పడేస్తాను’ అని హెచ్చరించినట్లు బహిరంగంగానే చెప్పారు. ఓ ప్రపంచ దిగ్గజ కంపెనీ సీఈవోను రాష్ట్ర ముఖ్యమంత్రి అలా బెదిరింపులకు పాల్పడటం అందరినీ నివ్వెరపరిచింది. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగిన అంశంలోనూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎల్‌అండ్‌టీపై కకక్షసాధింపు చర్యలకు పాల్పడిందనే విమర్శలున్నాయి. బరాజ్ పునరుద్ధరణలో నిబంధనలు, ఒప్పందాల మేరకు అడుగులు వేయాల్సిన ప్రభుత్వం ఎల్‌అండ్‌టీపై దుందుడుకుగా వెళ్లిందని, కాంగ్రెస్ ప్రభుత్వంతో తాము ఏగలేమని ఆ కంపెనీ నిర్ణయానికి రావడానికి ఇది కూడా ఒక కారణంగా పలువురు అభివర్ణిస్తున్నారు.
మెట్రో మొదటి దశను నిర్వహిస్తున్న ఎల్అండ్టీ కంపెనీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తదుపరి ప్రాజెక్టుల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపింది. ఇందుకు నిదర్శనమే ఎయిర్‌పోర్టు మెట్రో! రూ.6,250 కోట్లతో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 32 కిలోమీటర్ల ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో ఎల్అండ్టీ పనులు చేసేందుకు ముందుకొచ్చింది. టెండర్లలో రెండు కంపెనీలు బిడ్లు దాఖలు చేయగా.. అందులో ఒకటి ఎల్అండ్టీ. అంటే నగరంలో మెట్రో విస్తరణ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆ కంపెనీ సుముఖంగా ఉండిందనేందుకు ఇదే నిదర్శనం. అంతేకాకుండా ఓ ప్రపంచ దిగ్గజ కంపెనీ హైదరాబాద్ మహానగరానికి వన్నె తెచ్చే మెట్రో ప్రాజెక్టును నిర్వహిస్తున్న సమయంలో.. కష్టాలు చెప్పుకున్నప్పుడు ప్రభుత్వాలు వారికి ఊరట కలిగించే చర్యలు చేపట్టాలి. దీనిని ఓ ప్రైవేటు కంపెనీకి మేలు చేస్తున్నామనే కోణంలో కాకుండా నగర అభివృద్ధి, పేరు ప్రఖ్యాతలు పెరిగేందుకు దోహదపడుతున్నాయనే కోణంలో చూడాల్సి ఉంటుంది. వీటికిమించి నగరాల్లో ప్రజారవాణా అనేది నిత్యం నష్టాల్లో ఉంటుంది. ప్రభుత్వాలే వాటిని ఇతోధికంగా ఆదుకోవాలనేది ప్రపంచ నగరాల అనుభవాలే చెప్తున్నాయి. అందుకే కేసీఆర్ ప్రభుత్వం అదేరీతిన వ్యవహరించింది. అందుకే కరోనావంటి క్లిష్ట సమయాన్ని ఎదుర్కోవడంతో పాటు నిర్వహణలో నెలకు రూ.600 కోట్ల లోటును చవిచూస్తున్న ఎల్అండ్టీకి కొంత ఊరట కలిగించేందుకు రూ.3వేల కోట్ల వడ్డీలేని రుణం ఇచ్చేందుకు 2022లో కేసీఆర్ ప్రభుత్వం ముందుకొచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా ఉండి, తమ కష్టసుఖాల్లో అండగా ఉండేందుకు సుముఖంగా ఉందనే భరోసాను ఆ కంపెనీకి కలిగించినట్లయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఇందుకు కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాలే అద్దం పడుతున్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేసి.. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని, జనాభానే లేని ఫ్యూచర్ సిటీ వైపు మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీంతోపాటు ఉచిత బస్సు పథకంతో తమపై అప్పులు పెరుగుతున్నాయంటే జైళ్లో పడేస్తానని బెదిరించింది. అందుకే పాతబస్తీ మెట్రోను సైతం చేపట్టేందుకు ఎల్అండ్టీ ఆసక్తి చూపలేదు. ఫ్యూచర్ సిటీతోపాటు విస్తరణ ప్రాజెక్టుల వైపుకన్నెత్తి కూడా చూడలేదు. ప్రభుత్వ దుండుడుకు వైఖరితోపాటు నగరంలోనే నష్టాలను చూస్తున్న మెట్రోను జనాభాలేని ప్రాంతంలో విస్తరిస్తుంటే అందులో భాగస్వామి కావడం తమకు మరింత నష్టదాయకమని ఆ కంపెనీ భావించినట్టుగా పలువురు విశ్లేషిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒకడుగు ముందుకేసి ఎల్అండ్టీ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నదని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టుగా నడుస్తున్నదని ప్రతిష్ఠాత్మక సంస్థపై రాజకీయ ఆరోపణలు చేశారు. దీంతో ప్రపంచంలోని అనేక నగరాల్లో లక్షల కోట్ల ప్రాజెక్టులు చేపట్టే దిగ్గజ కంపెనీ.. తనను రాజకీయాల్లోకి లాగడాన్ని ఏమాత్రం సహించలేకపోయిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎల్అండ్టీ చాలాకాలంగా మెట్రో నుంచి తప్పుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. మెట్రో విస్తరణ ప్రాజెక్టులు ఇందుకు కలిసి రావడంతో దాన్ని ఆసరాగా చేసుకొని ఆ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎల్అండ్టీతో విస్తరణ ప్రాజెక్టులపై ఒప్పందం చేసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వం రేవంత్ సర్కారుకు సూచించింది. దీంతో కొంతకాలం కిందట ఎల్అండ్టీ కేంద్రానికి లేఖ రాసింది. ఈ అప్పుల భారాన్ని మోయలేనందున మొదటి దశ ప్రాజెక్టును మీరే తీసుకోవాలని స్పష్టంచేయగా.. అందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్అండ్టీ ముందు విస్తరణ ప్రాజెక్టుపై ఒప్పంద ప్రతిపాదన పెట్టగానే ఆ కంపెనీ అందుకు అంగీకరించలేదు. ఇదే అదునుగా మొదటి దశను కూడా మీరే (రాష్ట్ర ప్రభుత్వం) తీసుకోవాలనే ప్రతిపాదనను పెట్టింది. దీంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేక తప్పలేదు. అందుకు సంబంధించిన సంప్రదింపులు, చర్చల సారాంశాన్ని గురువారం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) వెల్లడించింది.
హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు.. ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎల్అండ్టీ కంపెనీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఎల్ అండ్ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎంఏయూడీ సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం సెక్రెటరీ మాణిక్యరాజ్ పాల్గొన్నారు. ఎల్అండ్టీ గ్రూప్ సీఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, సీఎండీ సలహాదారు డీకే సేన్, ఎల్అండ్టీ మెట్రో రైల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో మెట్రో రైల్ ఫేజ్-1లో తమ మొత్తం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎల్అండ్టీ కంపెనీ ప్రతినిధులు స్పష్టంచేశారు. ఇప్పుడు ఎల్అండ్టీ మెట్రోపై ప్రస్తుతమున్న దాదాపు రూ. 13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించనుంది. దీంతోపాటు తమ కంపెనీ ఈక్విటీ విలువకు సుమారు రూ.2,000 కోట్లు వన్ -టైమ్ చెల్లింపు అందించాలని ఎల్అండ్టీ ప్రతిపాదించింది. ట్రాఫి క్ రద్దీ, ప్రజారవాణా అవసరాల దృష్ట్యా ప్రభుత్వం మెట్రోను విస్తరణ ప్రతిపాదనలను సిద్ధంచేసింది. ఫేజ్ -2ఏ, 2బీ విస్తరణలో భాగంగా 8 కొత్త మెట్రోలైన్ల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 163 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. మె ట్రో విస్తరణ ప్రతిపాదనలన్నీ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించిన కేంద్రం ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఫేజ్ -1 మెట్రోకు, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫేజ్ -2 విస్తరణకు సంయుక్త కార్యాచరణ అవసరమని సూచించింది. అందుకు వీలుగా ఒప్పందం కావాలని కేంద్రం స్పష్టంచేసింది. ఫేజ్ -2లో కూడా ఎల్అండ్టీ భాగస్వామ్యం ఉండాల్సి ఉంటుందని సూచించింది. కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్ఠంభనను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మెట్రో ఫేజ్-2లోనూ ఎల్అండ్టీ భాగస్వామ్యం పంచుకుంటే బాగుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఫేజ్-1, ఫేజ్ 2 కారిడార్ల మధ్య సంయుక్త కార్యాచరణకు కచ్చితమైన ఒప్పందం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు.
ఎల్అండ్టీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అనేక భారీ రవాణా ప్రాజెక్టులను నిర్మించింది, నిర్వహించింది. అలాంటి కంపెనీకే హైదరాబాద్ మెట్రో నిర్వహణలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ క్రమంలో రేవంత్ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వపరంగా నిర్వహించడం సాధ్యమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం లో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతభత్యాలే ఇవ్వలేక రాష్ట్రప్రభుత్వం సతమతమవుతున్నది. వివిధ రంగాల ఉద్యోగులు ఆందోళనబాట పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఎల్అండ్టీకి రూ.2వేల కోట్ల చెల్లింపు సెటిల్మెంట్ చేయడంతోపాటు మెట్రో ప్రాజెక్టుపై ఉన్న రూ.13వేల కోట్ల రుణాల్ని ప్రభుత్వమే తిరిగి చెల్లించాలి. ఈ రుణంపై వడ్డీ, అసలు చెల్లింపుతోపాటు మెట్రో నిర్వహణలో నెలకు రూ.600 కోట్ల వరకు లోటు ఏర్పడుతుందని ఎల్అండ్టీ చెప్తున్నది. అంటే రాష్ట్రప్రభుత్వం ఇక నుంచి ఆ లోటును కూడా భరించాల్సి ఉంటుంది. పైగా అనుభవం ఉన్న కంపెనీ నిర్వహణలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వం చేతుల్లోకి పోయిన తర్వాత ఇంకెన్ని పరిణామాలు చోటుచేసుకొని భారం ఇంకా ఎంత పెరుగుతుందో ఊహించడం కూడా కష్టంగానే ఉన్నది.
ఓ ప్రైవేటు సంస్థ ప్రభుత్వం నుంచి ఎంత వస్తే అంత ఎక్కువ పిండుకోవాలనుకుంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం-ఎల్అండ్టీ మధ్య జరిగిన సంప్రదింపుల్లో ఏకంగా రూ.3,900 కోట్లను వదులుకునేందుకు సంస్థ సిద్ధపడినట్టుగా అర్థమవుతుంది. హెచ్ఎంఆర్ఎల్ పత్రికా ప్రకటనలోనే.. చర్యల్లో భాగంగా ఎల్అండ్టీ తొలుత 5,900 కోట్లు తమకు ఇవ్వాలని ప్రభుత్వం ముందు డిమాండ్ ఉంచినట్టు పేర్కొన్నారు. తుదకు కేవలం రూ.2వేల కోట్లు ఇస్తామన్నా అంగీకరించినట్టు చెప్పారు. చర్చల్లో భాగంగా డిమాండ్‌లో 20-30 శాతాన్ని తగ్గించుకోవడమనేది సహజం. కానీ డిమాండ్ చేసిన మొత్తంలో కేవలం 33 శాతానికే అంగీకరించడమంటే ఎల్అండ్టీ ఎంత తొందరైతే అంత తొందరగా హైదరాబాద్ మెట్రో నుంచి వైదొలగాలనే ధృడనిశ్చయానికి వచ్చినట్టుగా స్పష్టమవుతుంది. ఇందుకు మరింత నష్టాన్ని సైతం చవిచూసేందుకు ఓ ప్రైవే టు కంపెనీ వెనుకాడలేదంటే ప్రభుత్వం దానితో వ్యవహరించిన తీరు కూడా ఓ కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.