హైదరాబాద్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): పేద బ్రాహ్మణుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యకలాపాలన్నీ స్తంభించిపోయి ‘సంక్షోభ పరిషత్తు’గా మారిపోయిందని పరిషత్తు పూర్వ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి ఆవేదన వ్యక్తంచేశారు. అసలు పరిషత్తు ఉన్నట్టా? లేనట్టా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం పరిషత్తును పునరుద్ధరించి సంక్షోభాన్ని నివారించాలని కోరారు.
ప్రభుత్వం తక్షణమే కనీసం రూ.30 కోట్లు విడుదల చేస్తే లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు వీలు కలుగుతుందని సూచించారు. సభ్య కార్యదర్శికి నిధులు విడుదల చేసే అధికారం లేనందున ఆ అధికారం తాత్కాలికంగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు. పరిషత్తు సమస్యలపై బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని వాపోయారు.
వివేకానంద విదేశీ విద్యాపథకం కింద 300 మంది విద్యార్థులు విదేశీ విద్యాసంస్థల్లో చేరగా, వారికి ఇంతవరకూ నిధులు విడుదల చేయలేదని, దీంతో వారు అక్కడ అవస్థలు పడుతున్నారని వివరించారు. వారి తల్లిదండ్రులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, ప్రభుత్వం వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. నిరుద్యోగుల స్వయం ఉపాధికి ఉద్దేశించిన ‘బెస్ట్’ పథకం, పేద విద్యార్థుల ఉపకార వేతనాలను అందించే శ్రీరామానుజ పథకం, వేద పాఠశాలల అభివృద్ధి, వేదవిద్యను అభ్యసించే విద్యార్థులు, వేద శాస్త్ర పండితులు తదితరులకు అందించే ఆర్థిక సహాయం కూడా పూర్తిగా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
కొత్త దరఖాస్తులు ఆహ్వానించడంలేదని, ఇదివరకే దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్యూలు నిర్వహించడం లేదని, బ్రాహ్మణ పరిషత్తులో నిధులు లేక చిన్నాచితకా పనులు కూడా జరగడంలేదని తెలిపారు. కార్యాలయంలో నిర్వహణ పనులు చేసే చిన్నచిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్వహణ పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వివిధ పథకాల అమలు కోసం ఏటా రూ.100 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు.