హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): మునుగోడు నూతన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మునుగోడు నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా హాజరయ్యే అవకాశం ఉన్నది.
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించటంతో అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 105 (ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేతో కలిపి)కు చేరింది. ఆరుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ బలం రాజగోపాల్‌రెడ్డి ఓటమితో ఐదుకు పడిపోయింది.