జగిత్యాల : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్ణపెల్లి సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న కుర్రు గ్రామంలో తొమ్మిది మంది కౌలు రైతులు చిక్కుకున్నారు. ఈ కూలీలను రక్షించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూ శర్మ, జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కూలీలను సురక్షితంగా తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బోర్ణపెల్లికి చెందిన వోల్లే రఘునాథ్, రంగారావు, దేవిధాన్, సాహెబ్ రావు, విజయ్, కార్తీక్, సత్యభామ, సునీత, విజయంతి అనే తొమ్మిది మంది కుర్రులో కౌలుకు తీసుకున్న భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. గోదావరి నది రెండుగా చీలిన చోట ఎత్తయిన ప్రాంతంలో కుర్రు ఉంది. కుర్రు ప్రాంతంలో వరద ప్రవాహం అధికమవడంతో.. ఆ 9 మంది కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. వరద పెరగడంతో రైతులు ఆందోళనకు గురై.. తమను రక్షించాలని బోర్ణపెళ్లి గ్రామస్తులు, అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తమై వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.