ఖమ్మం, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఉగ్రవాదులకు వర్తింపజేసే ‘ఉపా’ చట్టం కింద కేసునమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే బండి సంజయ్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నడిపారని ఆరోపించారు.
ప్రభుత్వం సకాలంలో స్పందించి బండి సంజయ్‌ని అరెస్టు చేయకపోతే మరిన్ని ప్రశ్నపత్రాలు లీకయ్యేవని అన్నారు. కేంద్రం అనేక అంశాల్లో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేయబోమని చెప్తూనే మరోవైపు ప్రైవేటీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవడం కేంద్రం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బొగ్గు గనులను ప్రైవేటీకరించే చర్యలను నిరసిస్తూ ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆందోళన చేయాలని నిర్ణయించిందని చెప్పారు.
బీజేపీ హఠావో.. దేశ్‌కో బచావో
బీజేపీ హఠావో, దేశ్‌కో బచావో అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని కూనంనేని తెలిపారు. పార్లమెంట్లో రూ.50 లక్షల కోట్లకు సంబంధించి బడ్జెట్‌పై చర్చ జరపకుండా కేంద్రంలోని బీజేపీ కుంటిసాకులతో బలవంతంగా ఆమోదించుకున్నదని విమర్శించారు. రూ.13 లక్షల కోట్లు ఎగ్గొట్టిన అదానీపై చర్యలు తీసుకోని కేంద్రం.. ప్రతిపక్ష పార్టీలకు చెందినవారిని ఇబ్బందులకు గురిచేయడానికి సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నదని దుయ్యబట్టారు. బీజేపీలో చేరితో నిందితులు పునీతులవుతారా? అని ప్రశ్నించారు. శనివారం రాష్ర్టానికి వస్తున్న ప్రధాని మోదీ బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, బొగ్గు గనుల ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.