Kunamneni | పదో తరగతి ప్రశ్నపత్రాలు వరుసగా బయటకు వస్తున్న ఘటనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లుగా వస్తున్న వార్తలు సీపీఐ జాతీయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంలో బీజేపీపై వస్తున్న ఆరోపణల దృష్ట్యా ఆ పార్టీ ప్రధాన బాధ్యత వహించాలని సాంబశివరావు అన్నారు.
ప్రశ్నపత్రం పరీక్ష మొదలైన కొద్దిసేపటికి వాట్సాప్ గ్రూపులలో ప్రత్యక్షం అవడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ప్రశాంత్‌ను అదుపులో తీసుకున్నారని, ఆ క్రమంలోనే బండి సంజయ్‌తో సంబంధాలున్నట్లు, అంతకంటే ముందు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి రాజశేఖర్‌రెడ్డితో బీజేపీకి సంబంధాలు ఉన్నట్లు బహిర్గతమయ్యాయన్నారు.
పేపర్ లీకేజీపై ప్రత్యక్ష ఆందోళన చేస్తున్న బండిసంజయ్ ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని నిరూపించుకోవాలన్నారు. లక్షలాది విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడడం, తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీల ద్వారా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా బీజేపీ కుట్ర పన్నుతున్నదని వస్తున్న వార్తల నేపథ్యంలో వీటన్నింటిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి, దోషులను శిక్షాంచాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.