హైదరాబాద్, మే 26(నమస్తే తెలంగాణ) : చేనేత రంగాన్ని ప్రభుత్వం పరిరక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పాలకుల నిర్లక్షంతో చేనేత వృత్తి నిర్వీర్యం అవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అధ్యక్షతన మగ్దూమ్‌భవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ఎస్సీ సబ్‌ప్లాన్ తరహాలో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. తద్వారా కులవృత్తులను ఆధునీకరించి.. కార్మిక కుటుంబాలకు మెరుగైన ఉపాధిని కల్పించాలని కోరారు.
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని సూచించారు. చేనేత రంగం సమస్యల పరిషారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుడు చేనేత రంగానికి నాబార్డు ద్వారా రూ.1000 కోట్లు రుణాలుగా ఇచ్చేదని, వీటిని నిలిపివేయడంతో కార్మికులు అధిక వడ్దీలకు రుణాలు తీసుకుని, వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, చేనేత రంగ నిపుణులు దొంతి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.