హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కేంద్రహోం మంత్రి అమిత్‌షా నిజామాబాద్‌లో పసుపుబోర్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆఫీసులో ప్రారంభించడం తప్ప.. బోర్డు పనుల అభివృద్ధికి నిధులు కేటాయించపోవడం బాధాకరమని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, జాన్‌వెస్లీలు అన్నారు. సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు పిలుపులేకున్నా.. వామపక్ష పా ర్టీల నాయకులను ముందురోజే అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు.
పసుపు మద్దతు ధరపై ఒకమాట కూడా మాట్లాడకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం వివక్షత చూపుతుందని ఆరోపించారు. 9న జరగనున్న సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నట్టు వారు తెలిపారు. కార్మికుల హక్కు లు కుదించడానికి లేబర్కోడ్లు అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ లేబర్కోడ్లకు వ్యతిరేకంగా సమ్మెకు కార్మిక సంఘా లు పిలుపునిచ్చాయని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ,ఎంసీపీఐ,సీపీఐఎంల్ లిబరేషన్,ఎస్‌యూసీఐ(సీ),ఎస్ఎస్పీ పాల్గొన్నారు.
నక్సలైట్లతో చర్చలు ఉండవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నిజామాబాద్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. నక్సలైట్లను చంపగలరేమో కానీ, నక్సలిజాన్ని అంతమొందించలేరని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా నక్సలిజాన్ని అంతం చేస్తామన్న అమిత్‌షా వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.