హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రౌడీ రాజకీయాలు నడిపే వారికి నల్లగొండ జిల్లాలో స్థానం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి హెచ్చరించారు. సీపీఐ పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మునుగోడు నియోజక వర్గంలోని నాంపల్లి మండలం తుంగపాడు గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంలో బీజేపీకి చెందిన దుండగులు సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి తదితరులపై దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
ప్రశాంతంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో ఉద్రిక్తతలు తలెత్తేలా బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. బీజేపీ గూండాల దాడిలో జిల్లా కార్యదర్శి సత్యంకు గాయాలయ్యాయని తెలిపారు. రాజకీయాలను రౌడీయిజంగా మారిస్తే ఆ విధమైన దుండగులకు నల్లగొండ జిల్లాలో స్థానం ఉండదని హెచ్చరించారు. దాడులకు పాల్పడిన వారిపై చర్య లు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.