హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ) : ఫిరాయింపు ఎమ్మెల్యేలు సిగ్గూశరం ఉంటే పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ చేశారు. కనీసం పార్టీ మారినట్టు కూడా చెప్పుకోలేని దుస్థితిలో వాళ్లు ఉన్నారని ఎద్దేవాచేశారు. ఓల్డ్బోయిన్పల్లిలో శుక్రవారం మదర్సా ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ తాను టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు బహిరంగంగా చెప్పి టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నానని గుర్తుచేశారు. అదే కండువాతో గ్రేటర్ ఎన్నికల్లో 8 మంది కార్పొరేటర్లను గెలిపించుకున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన వాళ్లు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకొంటున్నారని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్లోనే ఉంటే అసెంబ్లీలో తమ పక్క సీట్లలో ఎందుకు కూర్చోలేదని ప్రశ్నించారు. ఉదయం లేస్తే రేవంత్రెడ్డి పాట పాడుతూ తిరిగేవాళ్లు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకోవడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వారిని మోసం చేసి ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఫిరాయింపుదారులపై విజ యం సాధించిందని, కోర్టు మొట్టికాయలు వేసేసరికి ప్లేటు ఫిరాయిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో రేవంత్రెడ్డి ఎవరైనా పార్టీ మారితే వాళ్లను రాళ్లతో కొటి చంపండని ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ‘మరి అలాంటి వ్యక్తి పార్టీలోనే మీరున్నరు. మిమ్మల్ని ఏం చేయాలో మీరే చెప్పండి’ అని ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీశారు. ‘ప్రజలే దేవుళ్లని మీరు అనుకుంటే మీరు కాంగ్రెస్లోకి వెళ్లినట్టు ఒప్పుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ‘మిమ్మల్ని చిన్న పిల్లలు కూడా నమ్మరు.. మీరు కాంగ్రెస్లోకి వెళ్లారని పిల్లాడినడిగినా చెప్తరు.. మీరు కాంగ్రెస్లోకి వెళ్లకుంటే బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదు? మీ మోసాలను ప్రజలు క్షమించరు. మీకు కచ్చితంగా బుద్ధి చెప్తరు. న్యాయస్థానాల్లో మీకు శిక్ష తప్పదు’ అని హెచ్చరించారు.