హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ)/కేపీహెచ్‌బీ కాలనీ, బా లానగర్ : కూకట్పల్లి, బాలానగర్‌లో కల్తీకల్లు ఆరుగురి ప్రాణాలు తీసింది. స్థానిక కల్లు దుకాణాల్లో కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురికాగా వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, ఆబ్కారీ, పోలీసుల కథనం ప్రకా రం ఈ నెల 7న సాయంత్రం బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కూకట్పల్లి, ఎస్పీ నగర్, హైదర్‌నగర్, శంషీగూడ, భాగ్యనగర్ కాలనీ ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో పలువురు కల్లు తాగారు. ఇంటికి వెళ్లిన తర్వాత వారిలో చాలామంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కొందరు సోమవారం రాత్రి, మరికొందరు మంగళవారం ఉదయం స్థానిక ప్రైవేటు దవాఖానల్లో చేరారు. మరోవైపు, బాధితుల సం ఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటం తో స్థానిక పోలీసులు, ఆబ్కారీ అధికారు లు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. బుధవారం నాటికి బాధితుల సంఖ్య 100కు చేరింది. బాధితుల్లో 28 మందిని గుర్తించిన అధికారులు చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు.
కల్తీకల్లుకు ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్టు తెలిసింది. హైదర్‌నగర్ హెచ్ఎంసీ హిల్స్‌లో నివాసముంటూ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న వనపర్తి జిల్లా మదిగట్ల గ్రామానికి చెందిన సీతారాం స్థానిక దుకాణంలో కల్లు తాగి ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు తొలుత అతడిని స్థానిక ప్రైవేటు దవాఖానకు, మంగళవారం గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సీతారం మృతి చెందాడు. దీంతో ఆయన భార్య అనిత బుధవారం కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాంధీలోనే చికిత్స పొందుతున్న విజయ్, కృష్ణయ్యలను మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు. అలాగే, హైదర్నగర్కే చెందిన దరిమెట్లు స్వరూప (61) కూడా కల్లు తాగి అస్వస్థతకు గురై మంగళవారం మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్వరూప మృతి విషయం బయటకు పొక్కకుండా కల్లు కంపౌడ్ల నిర్వాహకులు, కొందరు ఆబ్కారీ అధికారులు, అధికార పార్టీ నాయకుడు ఒకరు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. హడావుడిగా అంత్యక్రియలు జరిపేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు అంతిమ యాత్రలో నుంచి స్వరూప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కాగా, కల్తీ కల్లు ఘటనలో ఆల్విన్ కాలనీ, సాయిచరణ్ కాలనీకి చెందిన చాకలి బుజ్జయ్య (55), నారాయణమ్మ (65), హైదర్‌నగర్‌కు చెందిన మౌనిక(25), నారాయణ(45) సైతం మృతి చెందినట్టు తెలిసింది. మౌనిక, నారాయణ బుధవారం రాత్రి మృతిచెందినట్టు రామ్‌దేవ్‌రావు దవాఖాన వర్గాలు తెలిపాయి. కానీ వీరికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేని పోలీసులు తెలిపారు.
బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కల్లు దుకాణాలలో కల్తీ కల్లు తాగి మృతిచెందిన వారికి సంబంధించి ఫిర్యాదులు రాకుండా కల్లు మాఫియాలు, కొన్ని రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నట్టు తెలిసింది. మరణాల వార్త బయటకు వస్తే తమ వ్యాపారాలకు ఇబ్బందులు ఎదురవుతాయని కల్తీ కల్లు మరణాల సమాచారంతో పాటు అస్వస్థతకు గురైన మరింత మంది వివరాలను బయటకు పొక్కకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కొందరు ఆబ్కారీ అధికారులు సైతం ఆ అదృశ్య శక్తులకు సహకరిస్తూ మరణాల సమాచారాన్ని బయటకు రాకుండా అడ్డుకుంటున్నట్టు తెలిసింది.
కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన 28 మంది బాధితులను అధికారులు ఆయా ప్రైవేటు దవాఖానల నుంచి నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిమ్స్‌కు చేరుకుని చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కల్తీకల్లు ఘటనపై మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే ఎక్సైజ్, పోలీసు అధికారులు బాధితులను దవాఖానలకు తరలించినట్టు చెప్పారు. సకాలంలో వైద్యం అందడంతో బాధితులందరూ కోలుకుంటున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు. బాధితులందరూ ఒకే రకమైన లక్షణాలతో బాధపడుతున్నారని, ప్రాథమికంగా ఇది కల్తీ కల్లు వల్లే జరిగినట్టు భావిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై ఎక్సైజ్, పోలీస్‌శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. బాధ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. ఐదు కల్లు డిపోలను సీజ్ చేశారని, కల్లు శాంపిల్స్ సేకరించి ఎక్సైజ్ కెమికల్ ల్యాబరేటరీకి పంపినట్టు తెలిపారు. అలాగే, చికిత్స పొందుతున్న వారి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు వివరించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కల్లు డిపోల లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తామన్నారు. మంత్రి వెంట ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తదితరులున్నారు.