Housing Board | హైదరాబాద్, మే 28(నమస్తే తెలంగాణ) : కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేస్-7 పరిధిలో 4 నివాస, 15 వాణిజ్య ప్లాట్లకు వచ్చే నెల 11న బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. నివాస ప్లాట్ల ధర చదరపు గజానికి రూ.1.25 లక్షలుగా, వాణిజ్య ప్లాట్ల ధర రూ.1.50 లక్షలుగా నిర్ణయించారు. నివాస ప్లాట్ల వైశాల్యం కనిష్ఠంగా 194 గజాలు, వాణిజ్య ప్లాట్ల వైశాల్యం 800 నుంచి 920 గజాల వరకు ఉంది. హౌసింగ్ బోర్డుకు హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతా ల్లో 4609 ఎకరాలు ఉండగా, అందులో 3820 ఎకరాల్లో ఇదివరకే కాలనీలు నిర్మించారు.
మిగిలిన 789 ఎకరాల్లో 80 ఎకరాలపై కోర్టులో కేసులు ఉండగా, 610 ఎకరాలు క్లియర్‌గా ఉన్నాయి. 150 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చారు. 100 ఎకరాలు జేఎన్టీయూకు ఇవ్వగా, మిగిలినవి వివిధ సంస్థలు, వ్యక్తులకు ఇచ్చారు. నిధుల సమీకరణలో నిమగ్నమైన సర్కారు దృష్టి ఈ ఆస్తులపై పడింది. ఆస్తుల స్థితి తదితర వివరాలతో కూడిన నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందించారు. నిధుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం ఈ భూములను విక్రయించాలని నిర్ణయించింది.