హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కావల్సింది అధికారస్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్ర శాసనమండలిలో పట్టభద్రుల సమస్యలపై బలమైన గొంతు వినిపించే ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులను కోరారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి హనుమకొం డ జిల్లాలోని మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారని తెలిపారు. ప్రతిష్ఠాత్మక బిట్స్ పిలానిలో రాకేశ్‌రెడ్డి విద్యాభ్యాసం చేశారని, మేనేజ్మెంట్, ఎకనామిక్స్‌లో డ్యుయల్ మాస్టర్స్ డిగ్రీ పొందిన ఉన్నత విద్యావంతుడని కొనియాడారు. అమెరికాలో పలు అంతర్జాతీయ కంపెనీల్లో రాకేశ్‌రెడ్డి ఉద్యోగం చేసి వచ్చారని తెలిపారు. సమకాలీన రాజకీయాలపై, ఆర్థిక స్థితిగతులపై ప్రముఖ పత్రికల్లో వ్యాసాలు రాయడమే కాకుండా నవశకానికి నాంది, ప్రగతి రథచక్రాలు, ఫిసల్ ఫెడరలిజం, దడాన్ ఆఫ్ న్యూఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలను రచించారని పేర్కొన్నారు. సివిల్స్ కోచింగ్‌కు గెస్ట్ లెక్చర్లు ఇచ్చారని, ఈ-క్లాసెస్ యాప్ అనే ఫ్రీ కోచింగ్ యాప్ ద్వారా ఉచితంగా అందజేశారని వివరించారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఆదివారం భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు భువనగిరిలోని సాయి ఫంక్షన్ హాల్లో, మధ్యాహ్నం ఆలేరు నియోజకవర్గంలోని ఎమ్మడి నరసింహారెడ్డి గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశాల్లో ప్రసంగించనున్నారు.