హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ పోరాటంలో కేసీఆర్ చూపిన తెగువను, పోరాట పటిమను సోషల్ మీడియాలో ఓ పెద్దమ్మ వివరించిన వీడియోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మొన్న ఈ పెద్దమ్మ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినయి! పదవుల కోసం పెదవులు మూసుకునే రాజకీయ నాయకులున్న రోజుల్లో.. ఉన్న పదవులన్నీ వదులుకుని, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరో ఈ పెద్దమ్మ మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. మీ క్లారిటీకి హ్యాట్సాఫ్! కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎంత చిత్తశుద్ధితో, నిబద్ధతతో నడిపారో.. వారి సారథ్యంలో సబ్బండ వర్ణాల ప్రజలు ఉద్యమంలో ఎలా పాల్గొన్నారో గుర్తుచేసిన ఈ ఉద్యమకారిణికి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకం ; బసవన్న జయంతి సందర్భంగా కేటీఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): 12వ శతాబ్దంలోనే సామాజిక న్యాయానికి, విప్లవానికి బీజం వేసిన మహనీయుడు బసవేశ్వరుడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. వీరశైవ లింగాయత్ సంప్రదాయ వ్యవస్థాపకుడు, సమానత్వం, కరుణల బోధకుడు బసవేశ్వరుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేహమే దేవాలయమని, శ్రమను మించిన దైవం లేదన్న బసవేశ్వరుడు కుల వ్యవస్థను, వర్ణ బేధాలను, లింగ వివక్షను వ్యతిరేకించారని తెలిపారు. బసవేశ్వరుడి బోధనలు నీతి, నిజాయతీ, సమాజంలో అందరికీ సమాన అవకాశాల కోసం పోరాడే స్ఫూర్తిని ఇస్తాయని పేర్కొన్నారు. బసవ జయంతి సందర్భంగా, ఆయన ఆదర్శాలను ఆచరణలో పెట్టి, సమసమాజ నిర్మాణానికి కృషి చేద్దామని కేటీఆర్ ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.