KTR Tea Stall | సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 21 : సిరిసిల్ల బతుకమ్మ ఘాటు వద్ద కేటీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన కేటీఆర్ టీ స్టాల్‌కు ట్రేడ్ లైసెన్స్ లేదంటూ మున్సిపల్ అధికారులు మూసివేయించిన ఘటన మరువకముందే మరోసారి చిరు వ్యాపారిపై దౌర్జన్యం చేశారు.
హోటల్ యజమాని బత్తుల శ్రీనివాస్‌కు కనీస సమాచారం ఇవ్వకుండానే, హోటల్లోని సామాగ్రిని కూడా తీసుకొనివ్వకుండానే క్రేన్ సహకారంతో టీ స్టాల్ మున్సిపల్ అధికారులు సినారె కళామందిరానికి తరలించారు. మార్గమధ్యంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన బత్తుల శ్రీనివాసును పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అడ్డుకోవడం, ఆందోళన చేయడం లాంటివి చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు శ్రీనివాస్‌ను హెచ్చరించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, తదితర నాయకులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని బాధితుడికి భరోసానిచ్చారు.