హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మనువడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు సోమవారం సాయంత్రం ఆటలాడుతుండగా గాయపడ్డాడు. స్పోర్ట్స్ ఇంజురీ కారణంగా ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చేరాడు. మంగళవారం సాయంత్రం ఏఐజీ దవాఖానకు వచ్చిన కేసీఆర్.. చికిత్స పొందుతున్న తన మనువడు హిమాన్షును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హిమాన్షుకు పెద్ద ప్రమాదమేమీ జరుగలేదని, చిన్న గాయమే కావడంతో అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. కేసీఆర్ స్వయంగా వచ్చి మనువడిని పరామర్శించడంతో గచ్చిబౌలి ఏఐజీ దవాఖాన వద్ద కాసేపు సందడి నెలకొన్నది.
ఆందోళన వద్దు : కేటీఆర్
హిమాన్షు గాయపడిన ఉదంతంపై ఆయన తండ్రి, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నా కుమారుడు హిమాన్షు నిన్న సాయంత్రం ఒక చిన్న స్పోర్ట్స్ ఇంజ్యూరీకి గురయ్యాడు. ప్రస్తుతం అతడికి చికిత్స జరుగుతున్నది. మరికొద్ది రోజుల్లోనే తను మామూలు స్థితికి వచ్చేస్తాడు. హిమాన్షు ఆరోగ్యంపై ఆందోళనతో.. ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్న ప్రతి ఒకరికీ ధన్యవాదాలు’ అని కేటీఆర్ పేరొన్నారు.
త్వరలోనే మీ ముందుకొస్తా : హిమాన్షు
మరోవైపు హిమాన్షు సైతం తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇచ్చారు. ‘నిన్న రాత్రి స్పోర్ట్స్ ఇంజ్యూరీ కారణంగా నేను దవాఖానలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను బాగున్నాను. కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నాపై మీకున్న ప్రేమ, మద్దతు, నన్ను అర్థం చేసుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. త్వరలోనే మళ్లీ మీ ముందుకొస్తాను’ అని హిమాన్షు ట్వీట్ చేశారు.