హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్ వలే ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల గురిం చి ఏమైనా కొత్త విషయాలు చెప్తారేమోనని భావించామని, కానీ గవర్నర్ నోటితో అన్ని అబద్ధాలే చెప్పించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒకమాట కూడా గవర్నర్ నోటి నుంచి రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్ల యావ తప్ప ఎలాంటి విజన్ లేద ని మండిపడ్డారు. సెక్రటేరియట్లో కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, సెక్రటేరియట్ ముందు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెట్టారని, మూడేండ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామని, ప్యాక్ చేసి ఆ విగ్రహాలను గాంధీభవన్‌కు పం పుతామని స్పష్టంచేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే గవర్నర్ ప్రసంగం పెండ్లిలో చావుడప్పు కొట్టినట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు.
మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ జిష్ణుదేశ్వర్మ ప్రసంగం ముగిసిన అనంతరం.. శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, బక్క జడ్సన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, డాక్టర్ సంజయ్‌కుమార్, ముఠా గోపాల్, సుధీర్‌రెడ్డితో కలిసి కేటీఆర్ మాట్లాడారు. ‘15 నెలల పేలవమైన, అట్టర్‌ఫ్లాప్ పరిపాలన గురించి ప్రాయశ్చిత్తం చేసుకొనేలా గవర్నర్ ప్రసంగం ఉంటుందని భావించాం. ఇది గవర్నర్ ప్రసంగంలా లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే గాం ధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా ఉన్నది. గవర్నర్ నోటితో అర్ధసత్యాలు, అసత్యాలు పలికించారు. కాంగ్రెస్ సరారు ఘోర వైఫల్యం వల్ల ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉన్నది. రాష్ట్రంలో ఎకడికకడ పంటలు ఎం డిపోతున్నయ్. ఇప్పటికే 480 పైచిలుకు రైతు లు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు సాం త్వన చేకూర్చే, ఉపశమనం కలిపించే, భరోసా ఇచ్చే మాట గవర్నర్ నోటినుంచి వస్తుందేమోనని ఆశించాం. వారి నోటివెంట ఒకమాట కూడా రాలేదు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
25-30 శాతానికి మించి రుణమాఫీ కాలేదు
‘అసలు ఈరోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలోనూ 25 నుంచి 30 శాతానికి మించి రుణమాఫీ జరుగలేదు. దీనిపై గత శాసనసభలో ప్రభుత్వాన్ని అడిగినం. ఒక ఊరిలో వందశాతం రుణమాఫీ జరిగితే మేం అందరం రాజీనామా చేస్తామని చెప్పాం. కానీ, మళ్లీ ఈ రోజు గవర్నర్ నోటివెంట రుణమాఫీ అయిపోయిందని, లక్షలాది మంది రైతులు సంతోషం గా ఉన్నారని అబద్ధాలు చెప్పించి.. గవర్నర్ స్థాయిని సైతం దిగజార్చి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం తన భ్రష్టత్వాన్ని, నీచత్వాన్ని బయటపెట్టుకున్నది’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఎండిపోతున్న గోదావరి పరీవాహకం
రేవంత్‌రెడ్డి చేతగానితనం వల్ల రాష్ట్రంలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ‘రైతుబంధు మొత్తం అందిం ది.. అది మాత్రమే కాకుండా రైతు కూలీలకు రూ.12,000 సహాయం చేస్తున్నామని గవర్నర్ నోట అబద్ధాలు చెప్పించడమంటే గవర్నర్‌కు కూడా అవమానం. గవర్నర్ దీనిని గుర్తించాలి. సాగునీటి సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నది. కేసీఆర్‌పై ద్వేషంతో, బీఆర్ఎస్పై గుడ్డి కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా 15 నెలలు ఎండపెట్టడం వల్ల గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్‌రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి. కానీ, ఆయన చేతగానితనం వల్ల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. పంట ఎండిపోయి రైతులు అవస్థలు పడుతూ, ఆగ్రహంతో పంటలకు నిప్పుపెట్టుకుంటున్నరు. పొలాల్లో గొర్రెలు, మేకలను మేపుతున్న రైతులు.. గవర్నర్ ప్రసంగం నుంచి ఒకమాట కోసం ఇవాళ ఎదురుచూశారు. కానీ, అది లేదు.’ అని కేటీఆర్ ఫైరయ్యారు.
ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేస్తరా?
దావోస్ నుంచి గతంలో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. స్వచ్ఛ బయో కంపెనీ పెట్టి రేవంత్‌రెడ్డి సోదరుడు పెట్టుబడి పెడుతున్నారని మండిపడ్డారు. కేన్స్ గుజరాత్‌కు, కార్నింగ్ తమిళనాడుకు, ప్రీమియర్ కంపెనీలు ఏపీకి తరలిపోయాయని విమర్శించారు. ‘గవర్నర్ ప్రసంగంలోని ప్రతి వాక్యం పచ్చి అబద్ధం. మోసం. ఇది గవర్నర్‌ను కూడా మోసం చేయడమే. బీసీలను కులగణన లెకలు తప్పని ప్రశ్నించిన సొంత పార్టీ ఎమ్మెల్సీని కూడా పార్టీ నుంచి తొలగించారు. కులగణన పేరుతో బీసీలను వంచిస్తున్నారు. మొత్తంగా గవర్నర్ ప్రసంగం పెండ్లిలో చావులో డప్పు కొట్టినట్ట్లు ఉన్నది’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కమీషన్ యావ తప్ప.. విజన్ లేదు
కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్ తప్ప ఎలాంటి విజన్ లేదని కేటీఆర్ విమర్శించా రు. పెండింగ్ బిల్లులు చెల్లించడానికి సచివాలయంలో 20% కమీషన్లు తీసుకుంటున్నారని ఇటీవలే చిన్న కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం భట్టి చాంబర్ ఎదుట ధర్నా చేశారని చెప్పారు. కుంభకోణాలు, 30% లాండ్ డీలింగ్స్, కాంట్రాక్టర్ల నుంచి 20% కమీషన్లు తీసుకుంటూ పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు పంపుతున్నారని విమర్శించారు. 30% కమీషన్ ఇస్తేనే మంత్రులు పనిచేస్తున్నారని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారని మండిపడ్డారు. ఒక గ్యారెంటీ, 420 హామీల్లో ఒక హామీనీ అమలుచేయకుండా రూ.లక్ష 62 వేల కోట్ల అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తొమ్మిదిన్నరేండ్లలో రూ.4.17 లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై ఎగిసిపడ్డ కాంగ్రెస్ నేతలు.. ఒకే సంవత్సరంలో రూ.లక్ష 62 వేల కోట్ల అప్పు చేసి ఒక్క కొత్త పథకాన్ని కూడా అమలుచేయలేదని, ప్రాజెక్టుల్లో ఒక్క ఇటుక పేర్చలేదని మండిపడ్డారు.
పంటలు ఎండితే ఉత్పత్తి పెరిగిందా?
నీళ్లు లేక పంటలు ఎండిపోతే రేవంత్‌రెడ్డి పాలనలో వరి ధాన్యం ఉత్పత్తి పెరిగిందని పచ్చి అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఏడాది పాలన వల్లే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరిగిందా? అని ప్రశ్నించారు. తమ హయాంలో రూ.4.5 లక్షల కోట్లకుపైగా వ్యవసాయానికి ఖర్చు చేశామని, నేడు కాంగ్రెస్ నేతలు వరిసాగు పెరిగిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఊర్లలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులను ప్రజలు తన్నితరిమి కొడుతున్నారని చెప్పారు.
గవర్నర్ ప్రసంగంలోని ప్రతి వాక్యం పచ్చి అబద్ధం. మోసం. ఇది గవర్నర్‌ను కూడా మోసం చేయడమే. మొత్తంగా గవర్నర్ ప్రసంగం పెండ్లిలో చావు డప్పు కొట్టినట్ట్లు ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్ తప్ప ఎలాంటి విజన్ లేదు.
-కేటీఆర్
సాగునీటి సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నది. కేసీఆర్‌పై ద్వేషంతో, బీఆర్ఎస్పై గుడ్డి కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా 15 నెలలు ఎండపెట్టడం వల్ల గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్‌రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రే.
-కేటీఆర్