KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పదేండ్ల కేసీఆర్ పరిపాలనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి పరుగులు పెట్టిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అది తాను చెబుతున్నది కాదని స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా లెకలతోసహా వివరించిందని ఆయన ఉదహరించారు. కేసీఆర్పై బురద చల్లాలని ఆరోపణలు చేసినప్పటికీ సాధ్యపడలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తకువ చేసి చూపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినప్పటికీ కుదరలేదన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎంఎస్ఎంఈ పాలసీలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తావించిన పలు అంశాలను ఆయన గుర్తుచేశారు.
గత పదేండ్లలో ఎంఎస్ఎంఈల వృద్ధిరేటు 11 శాతం నుంచి 15 శాతం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వమే ఒప్పుకున్నట్టు కేటీఆర్ తెలిపారు. 2018-2023 మధ్యలో టీఎస్-ఐపాస్ ద్వారా పెరిగిన సగటు పెట్టుబడులు 115 శాతం అవగా, జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటా 10 శాతం వృద్ధి చెందిందని వివరించారు. దీన్నిబట్టి ఏటా ఎంఎస్ఎంఈల సంఖ్య 15 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల కారణంగా ఉపాధి 20 శాతం పెరిగిందని, ఎస్సీ, ఎస్టీ మహిళలు 30 శాతం ఉద్యోగాలు పొందారని వివరించారు.
ఇవి బీఆర్ఎస్ లెక్కలు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెకనేనని కేటీఆర్ వెల్లడించారు. టీఎస్-ఐపాస్ వంటి ప్రగతిశీల విధానాలు, చిన్న పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహకాలతోనే ప్రగతి సాధ్యమైందన్నారు. కేసీఆర్ను తకువ చేయాలనుకొని కురచ బుద్ధితో విమర్శలు చేసినంత మాత్రాన నిజాలు దాగవని చురకలంటించారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నదెంత నిజమో.. కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నది కూడా అంతే నిజమన్నారు.